Site icon NTV Telugu

Bobby Simha: మూడు భాషల్లో ఒకేసారి ‘వసంత కోకిల’!

Bobby Simha

Bobby Simha

Vasantha Kokila: ఎస్.ఆర్.టి. ఎంట‌ర్ టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘వసంత కోకిల’. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా ‘న‌ర్త‌న‌శాల’ ఫేమ్ కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లై అంతటా విశేషాద‌ర‌ణ అందుకుంది. అలానే రేజ్ ఆఫ్ రుద్ర’ పేరిట వచ్చిన మోషన్ పోస్టర్ కూ మంచి స్పందన లభించింది. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ గా ఈ సినిమా రెడీ అవుతుంది. తెలుగు, తమిళ వర్షన్స్ లో ఆర్య పోషించిన పాత్రను కన్నడలో రక్షిత్ శెట్టి చేశాడు.

సినిమా జాన‌ర్ కి, బాబీ సింహా అత్యుత్త‌మ ప‌ర్ఫార్మెన్స్ కి త‌గిన విధంగానే ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌న్ ‘వ‌సంత కోకిల’ను తెర‌కెక్కించార‌ని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. జాతీయ అవార్డు గ్ర‌హిత‌, విల‌క్ష‌ణ కథానాయకుడు క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘వ‌సంత కోకిల’ ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలోనూ మ‌రో జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టించ‌డం విశేషం. మూడు భాషల్లోనూ ‘వసంత కోకిల’ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఆ తేదీన నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’, సాయిరోనక్ ‘పాప్ కార్న్’ మూవీస్ విడుదలకు రెడీ అవుతున్నాయి.

Exit mobile version