యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం ఏమంటే… ఈ రెండు కూడా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు.
నాగశౌర్య విలుకాడిగా నటించిన ‘లక్ష్య’ మూవీతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలు ఇప్పుడు రెండు వేర్వేరు ఓటీటీలలో ఒకే రోజున స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ‘వరుడు కావలెను’ మూవీని జనవరి 7న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇప్పటికే జీ 5 సంస్థ ప్రకటించింది. తాజాగా నాగశౌర్య ‘లక్ష్య’ను అదే రోజున స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ఆహా ఓటీటీ తెలిపింది. సో… కొత్త సంవత్సరం జనవరి 7న నాగశౌర్య తన సినిమాతో తానే పొటీపడబోతున్నాడు. అయితే ఇది అతని అభిమానులకు మాత్రం డబుల్ థమాకానే!
