మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఘనంగా జరుగుతోంది. ఈ ఫంక్షన్‌కు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దర్శకుడు పరశురాం తనకు రైటర్‌గా ఉన్నప్పటి నుంచి తెలుసని.. అతడు కష్టపడే విధానం తనను ఎంతో ఆకట్టుకుంటుందని తెలిపాడు. సర్కారు వారి పాట ట్రైలర్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్ అనేలా పరశురాం ఈ సినిమాను తెరకెక్కించాడని వంశీ పైడిపల్లి ప్రశంసించాడు. గీత గోవిందం సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న పరశురాం ఈనెల 12న విడుదల కానున్న ఈ మూవీ పరశురాం మెమరబుల్‌గా నిలిచిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు.
అటు దర్శకుడు తమన్ గురించి వంశీ పైడిపల్లి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సర్కారువారిపాట సినిమా కోసం తమన్ అన్ని సినిమాలను పక్కన పెట్టేశాడని.. అందులో తన సినిమా కూడా ఉందన్నాడు. తమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడని కొనియాడాడు. 12 ఏళ్ల నుంచి కష్టపడి తమన్ ఈ స్థాయికి చేరుకున్నాడని.. ఈ రోజు తమన్ గురించి ఎవరైనా గర్వపడుతున్నాడంటే అది వాళ్ల తల్లిదండ్రులేనని వంశీ పైడిపల్లి పేర్కొన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాతో సక్సెస్ కంటిన్యూ చేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపాడు. హీరో మహేష్‌బాబుతో తాను మహర్షి సినిమా చేశానని.. తన జీవితంలో మహేష్ తనకు ఇచ్చిన స్థానంపై ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నాడు. తనను స్నేహితుడిగా భావిస్తున్న మహేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.