Ram Pothineni: వచ్చీ రాగానే ‘ఎనర్జిటిక్ స్టార్’ అనిపించుకున్నారు; ఆ పై ‘ఉస్తాద్’ అనీ రెచ్చిపోయారు- ఏది చేసినా తనదైన బాణీ పలికిస్తూ అటు మాస్ నూ, ఇటు క్లాస్ నూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు ‘రాపో’ – అంటే రామ్ పోతినేని! పూరి జగన్నాథ్ నిర్దేశకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఘనవిజయం తరువాత హీరో స్టార్ భలేగా మారిపోయింది. అంతకు ముందు లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగిన రామ్, ఇప్పుడు మాస్ హీరోగానూ మార్కులు పట్టేస్తున్నారు. ఇక మాస్ కా బాప్ అన్న రీతిలో సినిమాలు రూపొందించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. దాంతో ఈ సారి రామ్ ఓ సాలిడ్ హిట్ పట్టేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రంలోని లుక్స్ ను రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఆ మాస్ లుక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత ఆ స్థాయి సక్సెస్ రామ్ చూడలేదు. బోయపాటి సినిమాతో అది దక్కుతుందని రామ్ ఫ్యాన్స్ అభిలాష!
రామ్ పోతినేని 1988 మే 15న హైదరాబాద్ లో జన్మించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ సోదరుడు మురళీ పోతినేని తనయుడే రామ్. చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంతో పరిచయం ఉండడం వల్ల రామ్ మనసు బాల్యంలోనే నటనవైపు సాగింది. పదునాలుగేళ్ళ ప్రాయంలోనే ‘అదయాలం’ అనే తమిళ లఘు చిత్రంలో నటించేశాడు. తన 17వ యేట వై.వి.ఎస్.చౌదరి తెరకెక్కించిన ‘దేవదాస్’లో తొలిసారి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాలోనే తన ఎనర్జీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో జనానికి పరిచయం చేశారు రామ్. దాంతో ‘ఎనర్జిటిక్ స్టార్’గా రామ్ నిలిచారు. అప్పటి నుంచీ మొన్నటి ‘ద వారియర్’ దాకా 19 చిత్రాలలో నటించిన రామ్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. రామ్ చిత్రాలలో “రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, నేను-శైలజ, ఇస్మార్ట్ శంకర్” వంటివి జనాదరణ పొందాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ హీరోగా రూపొందిన “రెడ్, ద వారియర్” చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. ‘రెడ్’లో రామ్ ద్విపాత్రాభినయంతో అలరించారు, ‘ద వారియర్’లోనూ పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించారు. రామ్ నటునిగా ఎప్పుడూ ఫెయిల్యూర్ కాలేదు కానీ, ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో అన్నీ ఆకట్టుకోలేదు. మురిపించిన కొన్నిటిని మాత్రం జనం భలేగా గుర్తుంచుకున్నారు.
ఎన్నైనా చెప్పండి నాటి మేటి హీరోలకే కాదు, నవతరం కథానాయకులకు సైతం ‘మాస్ హీరో’ అనిపించుకోవాలన్నదే లక్ష్యం! రామ్ అందుకు మినహాయింపేమీ కాదు. రామ్ తొలి నుంచీ డాన్సులతోనూ, ఫైట్స్ లోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో తాను కోరుకున్న మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచీ మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాతో అన్ని వర్గాలను అలరించే పాత్రలో రామ్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఎలా జనం ముందు నిలుస్తుందో, ప్రేక్షకులను ఏ తీరున మెప్పిస్తుందో చూడాలి.