Ustaad Bhagat Singh shoot halted due to heavy rains in Hyderabad : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పలు ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో తెరకెక్కించాలని అనుకున్నారు. ఏమైందో ఏమో సడన్గా ఆ ఐడియా డ్రాప్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో కొత్త సినిమా మొదలుపెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరిగినా సరే దాన్ని తెలుగు ప్రేక్షకులకు తగినట్లుగా పవన్ అభిమానులు ఆనందించే విధంగా మార్పులు చేర్పులు చేసినట్లు సినిమా యూనిట్ చెబుతోంది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాకి బ్యాడ్ లక్ మాత్రం వెంటాడుతోంది. ఏదో ఒక విధమైన అడ్డంకులు షూటింగ్ కి కలుగుతూనే ఉన్నాయి సుమారు 5 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారు.
ఈ రోజు నుంచి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా హైదరాబాద్ శివారులో ప్రారంభం కావాల్సి ఉంది. నిన్న సాయంత్రమే దానికి సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ నుంచి హరీష్ శంకర్ ఆయుధాలతో ఉన్న ఫోటో షేర్ చేసి మనల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ కూడా పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వరుణుడు మాత్రం నేనున్నాగా ఆపడానికి అన్నట్టుగా కుండపోత వర్షం హైదరాబాదులో కురిపించడంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురవడం ఆగినా నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షం మాత్రం పెద్ద వరదకు కారణమైంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. మళ్ళీ షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మీద సినిమా యూనిట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.