Agent: అక్కినేని చిన్న వారసుడు అఖిల్ ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో జోరు పెంచిన అయ్యగారు పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హిట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఇండియన్ స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ విషయంలో ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. కొన్ని కారణాల వలన రిలీజ్ డేట్లు మారుతూ వస్తున్నాయని తెలుపుతూ వస్తున్న మేకర్స్ ఎట్టకేలకు సాలిడ్ రిలీజ్ డేట్ తో వస్తున్నట్లు ప్రకటించారు.
ఏజెంట్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు దీపావళీ రోజున ప్రకటించారు. అంతేకాకుండా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటివరకు బీస్ట్ లుక్ లో కనిపించిన అఖిల్ ఈ పోస్టర్ లో ఎంతో క్లాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. సూట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని వర్షంలో గొడుగుపెట్టుకొని నడుచుకుంటూ వస్తున్న పోస్టర్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ లుక్ లో అఖిల్ అమ్మాయిలకు విపరీతంగా నచ్చేశాడు. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ లాంటివారందరు స్పేస్ ను ఆక్రమించేసుకున్నారు. ఈ బరిలోకి ఏజెంట్ కూడా అడుగుపెట్టేశాడు. మరి ఈ సంక్రాంతి పోరులో కుర్ర హీరో నిలుస్తాడా..? లేదా అనేది చూడాలి.