నందమూరి నటవంశంలో తారకరత్న ఆరంభంలోనే ఓ సంచలనం సృష్టించారు. తారకరత్న హీరోగా పరిచయం అవతున్న సమయంలో ఒకే రోజున తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ నాటికీ ఓ రికార్డు! ఆ రోజున ప్రారంభం కాకుండా, మరో శుభదినాన షూటింగ్ జరుపుకున్న తారకరత్న చిత్రం ‘ఒకటో నంబర్ కుర్రాడు’ ఆయన తొలి చిత్రంగా జనం ముందు నిలచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పించగా, కె.రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు. 2002 సెప్టెంబర్ 18న ‘ఒకటో నంబర్ కుర్రాడు’గా తారకరత్న జనం ముందు నిలిచారు.
‘ఒకటో నంబర్ కుర్రాడు’ కథ విషయానికి వస్తే – తన చెల్లెలు పెళ్ళి ఘనంగా చేయాలని భావిస్తాడు ఓ ఊరి మోతుబరి సింహాద్రి. ఆ చెల్లెలు వేరే వ్యక్తిని ప్రేమించి పారిపోవాలని చూస్తుంది. ఆమె అన్న వారి శవాలను తీసుకురమ్మని పంపిస్తాడు. కలసి జీవించలేకపోయినా, కలసి చావాలని భావించిన ఆ ప్రేమికులు బావిలో దూకి చనిపోతారు. అయినా, ఇకపై తన గ్రామంలో ఎక్కడా ప్రేమ అన్న పేరు వినిపించరాదని చాటింపేస్తాడు ఆ షావుకారు. కొన్నాళ్ళ తరువాత అతని కూతురు స్వప్న చదువు నిమిత్తం విశాఖపట్నం చేరుతుంది. అక్కడ స్నేహానికి ప్రాణమిచ్చే బాలు అనే అబ్బాయిపై అభిమానం ఏర్పరచుకుంటుంది. అదే కాలేజ్ లో రాజీవ్ అనే ఆకతాయి, స్వప్నపై మనసు పడతాడు. రాజీవ్ తండ్రి, స్వప్న నాన్న ఇద్దరూ బాల్యస్నేహితులు. వియ్యంకులు కావాలని ఆశిస్తారు. సింహాద్రికి తన కొడుకు రాజీవ్ ఫోటో ఇస్తాడు అతని తండ్రి. దానిని స్వప్నకు పంపిస్తారు.
అయితే ఫోటోలు మారిపోవడం వల్ల స్వప్నకు బాలు ఫోటో వెళ్తుంది. ఆమె కూడా బాలును ఇష్టపడడంతో వెళ్ళి తన ప్రేమ విషయం అతనికి అర్థమయ్యేలా చెబుతుంది. ఇద్దరూ ఎంచక్కా ప్రేమించుకుంటూ ఉంటారు. సింహాద్రి తన కూతురు పెళ్ళికి ఏర్పాట్లు చేస్తుంటాడు. అదే సమయంలో ఆమె బాలుతో తిరగడం రాజీవ్ తండ్రి చూస్తాడు. వచ్చి సింహాద్రిని నిలదీస్తాడు. ప్రేమ అంటేనే మండిపడే సింహాద్రి, కాలేజ్ కు వెళ్ళి బాలు, స్వప్నను విడదీయాలని చూస్తాడు. తండ్రి పంపిన ఫోటో చూసే తాను బాలును ప్రేమించినట్టు చెబుతుంది. ఇప్పుడు వచ్చి, ఫోటోలు మారిపోయాయి మనసు మార్చుకోమంటే ఎలా వీలవుతుందని ప్రశ్నిస్తుంది. కూతురుపై చేయి చేసుకుంటాడు సింహాద్రి. అది చూసి సహించలేని బాలు, తన ప్రేమను చంపుకొని స్వప్న ఎక్కడ ఉన్నా ఆమె బాగుంటే చాలునని తీసుకువెళ్ళమంటాడు. అయితే తన ప్రేమ ఫలించక పోవడంతో స్వప్న కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ లోకి వెళ్ళి అన్ని ద్రవాలనూ విసిరి పారేస్తుంది. మంటలు రేగుతాయి. ఆమెను చాకచక్యంగా బాలు రక్షిస్తాడు. మళ్ళీ ఆమె తండ్రిచేతికే స్వప్నను అప్పచెబుతాడు. కానీ, ప్రేమ విలువ తెలుసుకున్న సింహాద్రి కూతురును బాలు చేతిలోనే పెట్టడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో తారకరత్న సరసన రేఖ నాయికగా నటించగా, మిగిలిన పాత్రల్లో తనికెళ్ళ భరణి, గిరిబాబు, రాజీవ్ కనకాల, దేవదాస్ కనకాల, చిత్రం శ్రీను, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, చిట్టిబాబు, రఘుబాబు కనిపించారు. ఈ చిత్రానికి ఆకుల శివ కథను సమకూర్చారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పాటలు పలికించారు. ఇందులోని “నువ్వు చూడూ చూడకపో…నే చూస్తూనే ఉంటా…”, “తొడగొట్టి చెబుతున్నా…”, “ఒరేయ్ నువ్వు…”, “అగ్గిపుల్లా…”,”నెమలి కన్నోడా…”, “ఎన్ని జన్మలెత్తినా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
అంతకు ముందు నందమూరి నటవంశం మూడోతరం హీరో జూనియర్ యన్టీఆర్ కథానాయకునిగా ఎస్.ఎస్.రాజమౌళిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై ‘స్టూడెంట్ నంబర్ వన్’ సినిమా తెరకెక్కించారు. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే రాశారు. అదే పతాకంపై నందమూరి నటవంశం మరో హీరో తారకరత్నను పరిచయం చేస్తూ ‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే సమకూర్చడం జరిగింది. రాఘవేంద్రరావు శిష్యుడు, ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి ‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘స్టూడెంట్ నంబర్ వన్’ దర్శకుడు రాజమౌళి కూడా రాఘవేంద్రరావు వద్ద పనిచేసిన వారే కావడం గమనార్హం! అయితే ఈ రెండు సినిమాల స్క్రీన్ ప్లే ఒకే తీరున సాగడంతో జనానికి కొత్తదనం కనిపించలేదు. ‘స్టూడెంట్ నంబర్ వన్’ పోలికలు చాలా కనిపించినా, అందులోని కథలో ఉన్న పట్టు ఇందులో లేకపోవడంతో ‘ఒకటో నంబర్ కుర్రాడు’ అంతగా అలరించలేక పోయాడు. అయితే తారకరత్న ఎలా నటించి