తొలి సినిమా ‘గులాబి’తోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించారు కృష్ణవంశీ. రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండు సినిమాలు తీయగానే, మూడో చిత్రంతో నిర్మాతగా మారిపోయారు కృష్ణవంశీ. తమిళనాడులో మణిరత్నం ‘మద్రాస్ టాకీస్’ అనే బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. బహుశా, ఆ ప్రేరణతో కాబోలు కృష్ణవంశీ ‘ఆంధ్రా టాకీస్’ అనే పతాకంపై తొలి ప్రయత్నంగా ‘సిందూరం’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. పోలీస్ వర్సెస్ నక్సలిజమ్ పై తనదైన పంథాలో కృష్ణవంశీ ‘సిందూరం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ హీరోగా నటించగా, సైడ్ హీరో పాత్రలో రవితేజ కనిపించారు. 1997 సెప్టెంబర్ 12న ‘సిందూరం’ జనం ముందు నిలచింది.
ప్రజలకు రక్షకభటులుగా చెలామణీ అయ్యే పోలీసులు, అన్యాయం జరిగిన వారి పక్షాన నిలిచే నక్సలైట్స్ ఎందుకు తరచూ గొడవ పడుతున్నారు? ఈ ప్రశ్న అప్పట్లో ఎంతోమంది మేధావులను సైతం తొలిచివేసేది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన పంథాలో పయనించడం పోలీసుల పని కాగా, కమ్యూనిజం భావాలతో ప్రజలకు న్యాయం చేయాలని తపించడం నక్సల్స్ విధిగా భావించేవారు. ‘సిందూరం’ సినిమా కథ ఆరంభంలోనే ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్న పోలీసుల వ్యాన్ ను నక్సల్స్ పేల్చడంతో మొదలవుతుంది.
బుల్లిరాజు పోలీస్ ట్రైనింగ్ లో ఉంటాడు. ఎంచక్కా పోలీస్ ఉద్యోగం చేస్తూ, అమ్మని, అక్కని బాగా చూసుకుంటూ అక్క కూతురు బేబిని పెళ్ళాడి హాయిగా ఉండాలనుకుంటాడు. బుల్లిరాజు మిత్రులు చంటి, బైరాగి, సత్తిపండు ఊళ్ళో జులాయిల్లా తిరుగుతూ ఉంటారు. అందరికంటే వయసులో పెద్దవాడయిన బైరాగికి నక్సలైట్స్ తో సంబంధం ఉంటుంది. ఇక చంటి అంటే అదే ఊరిలోని లక్ష్మికి ఇష్టం. తన ఊరి లోకల్ పోలీస్ షావుకార్ల తొత్తుల్లా పనిచేస్తున్నారని బుల్లిరాజుకు తెలుస్తుంది. ట్రైనింగ్ మధ్యలో ఉండగానే ఊరికి వచ్చి, నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటాడు. బుల్లిరాజు మిత్రుడు సత్తిపండు నక్సలైట్స్ ఇన్ ఫార్మర్ అనే నెపంతో పోలీసులు తీసుకు వెళ్లి హింసిస్తుంటారు. అతని పక్షాన బుల్లిరాజు వెళతాడు. అక్కడ గొడవ జరుగుతుంది. సత్తిపండును పోలీస్ ఇన్ స్పెక్టర్ కాల్చి చంపుతాడు. అనుకోని విధంగా ఎస్.ఐ.ని బుల్లిరాజు చంపేస్తాడు. దాంతో బుల్లిరాజు నక్సలైట్ అనే ముద్ర పడుతుంది. అనూహ్యంగా బుల్లిరాజును నక్సల్స్ చేరదీస్తారు. అంతటితో ఆగకుండా ఓ దళానికి నాయకునిగా చేస్తారు. బుల్లిరాజు మాత్రం సగటు నక్సలైట్ లాగా కమ్యూనిస్టు, మావోయిస్టు సిద్ధాంతాలు వల్లించకుండా, అన్యాయం జరిగిన వారి పక్షాన నిలచి పోరాడుతూ ఉంటాడు. బైరాగిని ఆయుధాలు తీసుకువెళ్తూండగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతడిని విడిపించే ప్రయత్నంలో భాగంగా ఆ రాష్ట్ర మంత్రిని కిడ్నాప్ చేస్తారు. బుల్లిరాజుకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్ కే కేసు అప్పగిస్తారు. అతను ఆ ప్రాంతంలో నక్సలిజం లేకుండా చేయాలని కంకణం కట్టుకుంటాడు. బుల్లిరాజుతో పాటే చంటి దళంలో చేరి ఉంటాడు. అతడికోసం లక్ష్మి కూడా అందులో చేరుతుంది. బుల్లిరాజు ప్రేమించిన బేబీకి వేరే వ్యక్తితో పెళ్ళి చేయగా, విషం మింగి చనిపోతుంది. బుల్లిరాజు దళం తమ మనిషిని అప్పగిస్తే, మంత్రిని అప్పచెబుతాం అంటారు. ఆ సమయంలో పోలీసులకు, దళానికి మధ్య కాల్పులు జరుగుతాయి. బుల్లిరాజు, చంటిని ఆఫీసర్ లొంగిపొమ్మంటాడు. ఈ లోగా పోలీసులు బుల్లిరాజుపై కాల్పులు జరపడంతో చనిపోతాడు. నిస్సహాయంగా పోలీస్ ఆఫీసర్ మిగిలిపోతాడు. మంత్రిని మళ్ళీ వెనక్కి తీసుకుని దళం సభ్యులు అడవుల్లోకి వెళతారు.
దర్శకుడు ఈ వరకే కథ చెప్పి, ఈ మారణ హోమానికి సమాప్తం ఎప్పుడు? ఎక్కడ? అంటూ ప్రేక్షకుల ఊహకే ముగింపు వదిలేశారు. జనానికి అన్యాయం జరుగుతున్నంత వరకు వారి పక్షాన పోరాడేందుకు ఓ శక్తి అవసరం అన్న తలంపు ప్రేక్షకులకు కలుగక మానదు.
ఇందులో బుల్లిరాజుగా బ్రహ్మాజీ, చంటిగా రవితేజ, బేబిగా సంఘవి నటించారు. మిగిలిన పాత్రల్లో గీత, నరసింహరాజు, భానుచందర్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీరాజా, పృథ్వీ, అన్నపూర్ణ, సూర్య, ఆహుతి ప్రసాద్, బండ్ల గణేశ్ కనిపించారు. ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్, రచయిత కె.ఎన్.వై. పతంజలి సంభాషణలు పలికించారు. శ్రీ స్వరకల్పనలో రూపొందిన ఆరు పాటల్లో “హాయ్ రే హాయ్… జాంపండురోయ్…” అనే పాటను చంద్రబోస్ పలికించగా, మిగిలిన ఐదు పాటలూ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారాయి. ఇందులోని “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంద్రమందామా…” అంటూ మొదలయ్యే గీతం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది, ఆలోచింప చేసింది. “ఏడు మల్లెలెత్తు సుకుమారికి…”, “ఓ చెలీ అనార్కలీ…”, “ఊ లే లే ఊ లే లే…”, “ఊరికే ఉండదే….” అంటూ సాగే పాటలు సైతం అలరించాయి.
‘సిందూరం’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలచింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు లభించింది. దాంతో పాటు ఉత్తమ సంభాషణల రచయితగా పతంజలికి, ఉత్తమ గీతరచయితగా సిరివెన్నెలకు, ఉత్తమ గుణచిత్ర నటునిగా పరుచూరి వెంకటేశ్వరరావుకు, ఉత్తమ సహాయనటునిగా సూర్యకు నంది అవార్డులు దక్కాయి.