TV Actress Aman Sandhu Recovers Her Money Which She Lost To Cyber Scam: కేవలం అమాయకులే కాదు, సెలెబ్రిటీలు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఓ బుల్లితెర నటి కూడా చేరిపోయింది. ఓ పని నిమిత్తం అధికార వెబ్‌సైట్‌ని చేయబోయి, నకిలీ సైట్‌కి విచ్చేసింది. దెబ్బకు రూ. 2.24 లక్షలు పోగొట్టుకుంది. అయితే, పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి ఆ డబ్బుని తిరిగి రికవరీ చేయగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
గోరేగావ్‌లో నివసిస్తున్న బుల్లితెర నటి అమన్ సంధు.. తన తల్లికి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసమని ఈనెల 6వ తేదీన ఇంటర్నెట్‌లో జుహులో ఉన్న ఆసుపత్రి వెబ్‌సైట్ కోసం వెతికింది. అప్పుడు ఓ నకిలీ వెబ్‌సైట్ అచ్చం అధికార వెబ్‌సైట్‌లా కనిపించింది. దీంతో ఆ వెబ్‌సైట్‌కి విచ్చేసి, తన మొబైల్ నంబర్ నమోదు చేసింది. అలా చేయగానే ఓ నంబర్ నుంచి ఒక వ్యక్తి అమన్‌కి ఫోన్ చేశాడు. డాక్టర్‌ని కలవాలంటే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం వాట్సాప్‌కి పంపిన లింక్‌ని క్లిక్ చేయాలని సూచించాడు. అతడు చెప్పినట్టుగానే అమన్ ఆ లింక్‌ని క్లిక్ చేయగానే.. ఆమె మూడు ఖాతాల నుంచి రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దాంతో తాను మోసపోయానని గ్రహించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. తెలివిగా వ్యవహరించి ఆ డబ్బుని రికవరీ చేశారు. అలాగే, కాజేసిన ఆ అకౌంట్‌ని సైతం బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన అమన్ సంధు.. పోలీసుల్ని మనం విశ్వసించాలని, ఇది తాను అనుభవంతో చెప్తున్నానని సూచించింది. కాకపోతే.. ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా సంయమనం పాటించాల్సిందిగా హితవు పలికింది. ఇలాంటి సమయంలో పోలీసులే సహాయం చేయగలరని, తన డబ్బులు రికవర్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అమన్ సంధు చెప్పుకొచ్చింది.