Ram Charan: సెలబ్రిటీలు నిత్యం యవ్వనంలా కనిపించాలంటే వర్క్ అవుట్స్, డైట్ చేయాల్సిందే. ఇక తారలు కుటుంబ సభ్యులతో కంటే ఫిట్ నెస్ ట్రైనర్లతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక టాలీవుడ్ తారల ఫిట్ నెస్ ట్రైనర్ కులదీప్ సేతి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరికి కులదీప్ ఒక్కడే ట్రైనర్ గా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా లైగర్ లో విజయ్ అద్భుతమైన రూపానికి ఇతగాడే కారణం. రష్మిక, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లు సైతం కులదీప్ క్లయింట్స్సే. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. రామ్ చరణ్ ను ట్రైన్ చేసినప్పుడు అతడు ఎవరో తనకు తెలియదని, ఆయన కూడా ఎప్పుడు తాను మెగాస్టార్ కొడుకును అని చెప్పలేదని తెలిపారు.
“రామ్ చరణ్ ను మొదటిసారి జిమ్ లో కలిసినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. అందరిలానే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఒక రోజు నా ఫ్రెండ్ అతను ఎవరో తెలుసా అంటే.. తెలియదు అని చెప్పాను. వెంటనే నా ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను ఆ తర్వాత చరణ్ దగ్గరకు వెళ్లి.. ఏంటి భయ్యా మీరు మా బాస్ చిరంజీవి గారి కొడుకు అని ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. ఏం చెప్పాలి అని చిన్నగా నవ్వేశారు. ఆ తరువాత ఆయనతో పాటు చిరంజీవి గారిని కూడా ట్రైన్ చేసే అవకాశం వచ్చింది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం చరణ్ లో కనిపిస్తూ ఉంటుంది. ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.