Site icon NTV Telugu

పుష్ప‌తో ఆ జాబితాలో బ‌న్నీ!

pushpa

pushpa

పుష్ప‌ అంటే ప్ల‌వ‌ర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వ‌ద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప‌ చిత్రం డిసెంబ‌ర్ 17న జ‌నం ముందు నిలిచింది. వారి మ‌న‌సులు గెలిచింది. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన పుష్ప‌ చిత్రం అర్ధ‌శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజుల‌కు గాను రూ.350 కోట్లు పోగేసింద‌ని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్త‌రాది నుండే వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. బ‌హుభాషా చిత్రంగా పుష్ప‌ను జ‌నం ముందు నిలిపారు సుకుమార్. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు ఉత్త‌రాదిన హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. మొద‌ట్లో ప్యాండ‌మిక్ కార‌ణంగానూ, కొన్ని ప్రాంతాల్లోని నిబంధ‌న‌ల కార‌ణంగానూ పుష్ప‌ ఉత్త‌రాది వ‌సూళ్ళు మంద‌కొడిగానే సాగాయి. త‌రువాత ఈ సినిమా యాభై రోజుల‌కు ఉత్త‌రాదిన‌నే రూ.100 కోట్లు పోగేసింద‌ని తెలుస్తోంది.

ఇక మిగిలిన రూ.250 కోట్లు తెలుగు, దక్షిణాది వ‌ర్ష‌న్స్ ద్వారా మూట‌క‌ట్టింద‌ని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప‌తో అల్లు అర్జున్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నార‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ అంటున్నాయి. మొన్న‌టి దాకా తెలుగున‌టుల్లో ప్ర‌భాస్, రానా వంటివారే ప్యాన్ ఇండియా స్టార్స్ గా జేజేలు అందుకున్నారు. ఇప్పుడు పుష్ప‌ విజ‌యంతో బ‌న్నీ కూడా భ‌లేగా ఆ జాబితాలో చేరిపోయార‌ని చెప్ప‌వ‌చ్చు. పుష్ప‌కు ముందు, త‌రువాత కూడా కొన్ని తెలుగు చిత్రాలు హిందీలోకి అనువాద‌మై, ఒరిజిన‌ల్ మూవీతో పాటే విడుద‌లైనా, ఏవీ ఆ స్థాయిలో ఆక‌ట్టుకోలేక పోయాయి. మ‌రి పుష్ప‌ అందించిన ఉత్సాహంతో రెండో భాగంతోనూ బ‌న్నీ, సుకుమార్ మ‌రింత‌గా మురిపిస్తారేమో చూడాలి.

Exit mobile version