డీజే బాణీలకు పోలీస్ అధికారులు స్టెప్పులు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు. శోభాయాత్రలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని వినాయకుడి నిమజ్జనాన్ని పండగలా మార్చుతున్నారు. ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది ఊరేగింపులో పాల్గొని డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఏసీపీ సంజయ్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయనతో పాటు పలువురు పోలీస్ అధికారులు కూడా భక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. భక్తుల మధ్యే కలిసిపోయి, ఆనందంగా స్టెప్పులు వేస్తున్న పోలీసుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మిరాయ్ గురించి సీక్రెట్ చెప్పిన మంచు మనోజ్..
మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఆయన నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. బ్లాక్ స్క్వార్డ్ అనే మోడ్రన్ రావణాసురిడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయని ఇప్పటికే వచ్చిన ట్రైలర్ చెబుతోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీవీతో స్పెషల్ గా మాట్లాడారు మనోజ్. మిరాయ్ అంటే ఏంటో ఆయన వివరించారు. మిరాయ్ అంటే జపాన్ లో ఫ్యూచర్ లేదా హోప్ అని అర్థం. ఈ సినిమా కథ పూర్తిగా రేపటి కోసం జరిగే యుద్ధంలా కనిపిస్తుంది అంటూ తెలిపాడు మనోజ్. ఈ మధ్య నెగెటివ్ రోల్స్ ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి అసలు కారణం కూడా తెలిపాడు.
99 శాతం ఉద్యోగాలను తినేయనున్న ఏఐ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగాలకు ఎసరు పెట్టేస్తోంది. ఇప్పటికే, ఏఐ కారణంగా పలు టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువ కాబోతోంది. ఏఐ కారణంగా 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగులు ఏఐ కారణంగా నిరుద్యోగులుగా మారుతారని లూయిస్‌విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్కీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఏఐ వ్యవస్థలను వేగంగా అమలు చేస్తున్న సమయంలో, ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఇంటి యజమానులకు పూలదండలతో సన్మానం చేసి, వస్త్రాలను అందజేయడం ద్వారా వారికి సంతోషాన్ని కలిగించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయి అని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
సమోసా తీసుకురాని భర్త.. పొట్టుపొట్టు కొట్టిన భార్య
నిజంగా ఇది విచిత్రమే.. ఆలుమగల మధ్య వచ్చే పంచాయతీలు విడ్డూరంగా ఉంటాయనేది నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్‌లో ఓ సంచలన ఘటన వెలుగుచూసింది. పాపం భర్త.. భార్య, అత్తమామల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది.. ఆ భర్త చేసిన తప్పు ఏంటి, కట్టుకున్న మొగుడిని కన్న తల్లిదండ్రులతో భార్య కొట్టించడం ఏంత వరకు సబబు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. పిలిభిత్ జిల్లా భగవంతపూర్‌లోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన శివమ్‌కు సంగీతతో మే 22న వివాహం అయ్యింది. దంపతులు వాళ్ల కొత్త సంసారాన్ని సక్రమంగా, సంతోషంగా కొనసాగిస్తున్నారు. ఎందుకో సంగీతకు ఆగస్టు 30న సమోసాలు తినాలనిపించి భర్తకు ఫోన్ చేసి తీసుకొని రమ్మని కోరింది. వచ్చేటప్పుడు కచ్చితంగా సమోసాలు తీసుకొని రావాలని మరీమరీ చెప్పింది. పాపం మనోడు ఏ బిజీలనో పడి భార్య చెప్పిన మాటలను మర్చిపోయి ఇంటికి వచ్చాడు. ఇగ చూడాలి సంగీత శివతాండవం. ఎట్లా నువ్వు నేను చెప్పింది తేకుండా ఇంటికి వస్తావని మొదలు పెట్టి.. పాపం శివమ్‌కు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా తిట్ల భారతం షురూ చేసింది. ఎంతకీ ఆమె శాంతించక పోగా తల్లిదండ్రులు ఉషా, రామ్‌లదతేలకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. వచ్చిన వాళ్లు వచ్చేటప్పుడు బిడ్డకు ఇష్టమైన సమోసాలు పట్టుకొని పోతే పంచాయతీ అక్కడితోనే సమసిపోయేటిది కావచ్చు. కానీ వాళ్లు పట్టుకుపోలే.. పోయిన తర్వాత భార్యభర్తల పంచాయతీ తెలుసుకొని అల్లుడిని బిడ్డ నుంచి రక్షించకపోగా.. బిడ్డతో కలిసి అల్లుడిని తిట్టడమే కాకుండా చావబాదారని శివమ్ వాపోయాడు.
అల్లు అర్జున్ సంచలన రికార్డు.. టాలీవుడ్ లో తొలి హీరో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా అవార్డులు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గతంలోనూ అల్లు అర్జున్ సైమా అవార్డులు అందుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021), పుష్ప (2022) సినిమాల్లో అవార్డులు అందుకున్నాడు. ఈ తరం హీరోల్లో ఎక్కువగా టాలీవుడ్ నుంచి సైమా అవార్డులు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు.
కొత్త జీఎస్టీతో భారీగా తగ్గనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ధరలు.. పూర్తి వివరాలు..
మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్‌కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు. ఇంతకుముందు ప్రీయయం టీవీలతో పాటు చాలా వరకు ఎలక్ట్రిక్ ఐటమ్స్ 28 శాతం స్లాబ్‌లో ఉండేది, ఇప్పుడు 18 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి తగ్గిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది.
కన్న కూతుర్ని హత్య చేసిన తల్లి.. కొడుకు కోసమేనా..!
టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారి రమ్య అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. కన్న తల్లే ఆ చిన్నారిని హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు (సెప్టెంబర్ 6న) ఉదయం, నగరంలోని కొరమేనుగుంట దేవుని కాలనీలో 6 నెలల పసికందు రమ్యను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తండ్రి తిరుపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల కంప్లైంట్ తో రంగంలోకి దిగిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు. అయితే, ఒకవైపు పోలీసులు గాలింపు నిర్వహిస్తున్న సమయంలో, ఇంటి సమీపంలోని మురికి కాలువలో చిన్నారి రమ్య పడి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇక, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండటంతో, మూడో కుమార్తెగా రమ్య పుట్టిన తర్వాత తల్లి ఈ దారుణ ఘటనకు పాల్పడినట్టు ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని.. ఈ హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
