తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తలపెట్టిన సమ్మె విషయంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని, థియేటర్లలో సినిమాలకు తగిన ఆదరణ లభించడం లేదని, ఇప్పుడిప్పుడే కొవిడ్ సమస్యల నుండి బయటపడి కుదురుకుంటున్న సమయంలో సమ్మెకై 24 యూనియన్ల నాయకులు ఫెడరేషన్ పై ఒత్తిడి తేవడం సబబు కాదని నటుడు, ఫిల్మ్ ఆర్టిస్ట్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ ఓ కళ్యాణ్ అంటున్నారు.
కరోనా సమయంలో సినిమా పెద్దలు, నిర్మాతలు అందరకూ కలిసి సి.సి.సి. పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి సినీ కార్మికులను ఆదుకున్నారని, అటువంటి వారిని మరోసారి కలిసి, సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమ్మె సమయంలో కార్మికులకు వచ్చే కష్టాలను పట్టించుకునే పరిస్థితి యూనియన్లకు ఉందా అని ప్రశ్నించారు. ఎప్పుడూ లేనిది తొలిసారి మే డే రోజున యాభై లక్షలు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహించారని, అప్పుడు చిరంజీవి సహా సినిమా పెద్దలు ఆ కార్యక్రమంలో పాల్గొని, కార్మికుల గురించి మాట్లాడారని వారి ఇప్పుడు కూడా కలిసి సమస్య పరిష్కారం కోసం మార్గం చూడమని కోరడంలో తప్పులేదని ఓ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చిత్రపురి కాలనీకి సంబంధించిన సమస్యలు ఇరవై ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉండగా, సినీ కార్మికుల సమస్యలపై ఆగమేఘాలపై పరిష్కారం కోరుకోవడం సబబు కాదని అన్నారు. నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా, సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరారు.