సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కుతూ ఉంటుంది. ఈ వేడిని మరింత పెంచుతూ, పీక్ స్టేజ్ ని తీసుకోని వెళ్తూ ఈ సంక్రాంతికి చిరు-బాలయ్యలు తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. చిరు తన వింటేజ్ స్టైల్ ని చూపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’గా ఆడియన్స్ ని పలకరిస్తే, చిరు కన్నా ఒకరోజు ముందే బాలయ్య ‘వీర సింహా రెడ్డి’గా థియేటర్స్ లో దర్శనం ఇచ్చాడు. ఈ ఇద్దరు సినిమాలు విడివిడిగా రిలీజ్ అవుతున్నాయి అంటేనే బాక్సాఫీస్ దగ్గర మాములు సందడి ఉండదు అలాంటిది ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి అంటే ట్రేడ్ వర్గాల నుంచి అభిమానుల వరకూ ఎవరెన్ని లెక్కలు వేసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
థియేటర్స్ కౌంట్ నుంచి ఓపెనింగ్ డే, ఓవర్సీస్ కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇలా ప్రతి విషయంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల మధ్య పోటీ వస్తుంది. ఈ పోటీలో చిరు, బాలయ్యలలో ఎవరూ తగ్గకుండా ఆడియన్స్ కి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ మూలవిరాట్ లని తమకి నచ్చిన వింటేజ్ లుక్స్ లో చూడడానికి మెగా నందమూరి అభిమానులు థియేటర్స్ కి రిపీట్ మోడ్ లో వెళ్తున్నారు. దీంతో మొదటి మూడు నాలుగు రోజుల్లోనే ఈ సినిమాలు సెంచరీ కొట్టాయి.
బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమా నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ ని రాబడితే, చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అంటే రెండు సినిమాలు కలిసి, చిరు-బాలయ్యలు కలిసి ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం మూడు రోజుల్లోనే 212 కోట్లని రాబట్టారు. రీజనల్ సినిమాలతో, యావరేజ్ కంటెంట్ తో, నాన్-స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి కూడా బాలకృష్ణ, చిరంజీవిలు ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతున్నారు అంటే అది పూర్తిగా వారి బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. యంగ్ హీరోలకి కూడా పోటీ ఇచ్చేలా ఉన్న చిరు, బాలయ్యలు సాలిడ్ హిట్స్ కొట్టి 2023లో టాలీవుడ్ కి సాలిడ్ ఓపెనింగ్ ఇచ్చారు. ఇదే జోష్ ని రాబోయే సినిమాలు కూడా కంటిన్యు చేస్తే టాలీవుడ్ ఖాతాలో మరో బిగ్ ఇయర్ నమోదు అయినట్లే.