సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం నిర్మాతలకు పెద్ద టాస్క్ గా మారిపోయింది. గతంలో థియేటర్ కు వచ్చిన సినిమాలను కొంతమంది పైరసీ చేసేవారు. ఇప్పుడు విడుదలకు ముందే పైరసీ చేసేస్తున్నారు.
స్టార్స్ తో సినిమాలు తీసే నిర్మాతలు తమ కంటెంట్ ను కాపాడుకోవడానికి ఇవాళ చాలా తిప్పలు పడాల్సి వస్తోంది. నిర్మాతలు ప్రచారాస్త్రాలుగా పెట్టుకున్న వాటిని కొందరు కావాలని, మరికొందరు శాడిజమ్ తో లీక్ చేస్తున్నారు. గతంలో ‘బాహుబలి, అత్తారింటికి దారేది’ సినిమాలకు సంబంధించిన విజువల్స్ ఇలానే లీక్ అయ్యాయి. అదే పరిస్థితి మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. గత వారం రోజుల నుండి ఏదో ఒక సినిమాకు సంబంధించిన ఫుటేజ్ లీకైపోతోంది. మొన్నటికి మొన్న ‘సర్కారు వారి పాట’ మూవీ బ్లాస్టర్ ను నిర్మాతలు విడుదల చేస్తామని ప్రకటించిన సమయానికి కంటే ముందే సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ టీజర్ ను కొందరు కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఫైటింగ్ సీన్స్ ను సోషల్ మీడియాలో కొందరు పెట్టేశారు. ఆ మధ్య ‘రాధేశ్యామ్’ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా, దానిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి, యూనిట్ లోని వ్యక్తులే ఎవరో పోస్ట్ చేశారు. ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ పరిస్థితి కూడా అంతే… ఆ పాట రికార్డింగ్ థియేటర్ నుండే లీకైపోయింది. ఇలా ఫిల్మ్ మేకింగ్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ కాదేదీ లీకులకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
Read Also : “సర్కారు వారి పాట” తగ్గేదే లే !
స్టార్ హీరోల సినిమాలు ఇలా లీకుల బారిన పడితే, మూవీ మీద ఏర్పడిన క్రేజ్ చప్పున చల్లారిపోతుంది. దాంతో ప్రొడ్యూసర్స్ పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టకుండా… ఈ లీకులను ఎలా కంట్రోల్ చేయాలా అని బుర్ర బద్దులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల పరిస్థితి అలానే అయ్యింది. లీకులకు గురైన ‘పుష్ప, సర్కారు వారి పాట’ చిత్రాలను వారే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన కంటెంట్ లీక్ అయ్యిందని తెలియగానే, సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దృష్టికి దానిని తీసుకెళ్ళారు. దయచేసి సినిమా లీక్ ఫుటేజీలను ఫార్వర్డ్ చేయవద్దని, లీకులను ఎంకరేజ్ చేయవద్దని ప్రజలను కోరుతున్నారు.
చిత్రం ఏమంటే… ఆ మధ్య కృతీసనన్ నటించిన హిందీ చిత్రం ‘మిమి’ అధికారికంగా విడుదల కావాల్సిన దానికంటే నాలుగు రోజుల ముందే సోషల్ మీడియాలో లీకైపోయింది. దాంతో గత్యంతరం లేక ఓటీటీ సంస్థ దాన్ని ముందే స్ట్రీమింగ్ చేసేసింది. ఇటీవల ‘నారప్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్. థాను పైరసీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా తొలి కాపీని సిద్ధం చేసుకుని తమ దగ్గర ఉంచుకోవడానికి భయపడుతున్నామని, థియేటర్లు తెరచుకుని, జనం వచ్చే వరకూ కంటెంట్ పైరసీకి గురి కాకుండా భద్రపరచడం పెద్ద టాస్క్ గా మారిందని అన్నారు. ‘నారప్ప’ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి ఇది కూడా ఓ కారణమే అని చెప్పారు. కరోనా కారణంగా సినిమాల విడుదలలో జరుగుతున్న తీవ్ర జాప్యం కూడా ఇలాంటి లీకులకు ఆస్కారం ఇస్తోంది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టంలో ఇటీవల కీలకమైన సవరణలు చేసింది. సినిమా కంటెంట్ ను లీక్ చేసే వారికి కూడా ఆ చట్టం వర్తించేలా చేస్తే కొంతలో కొంత భయం అనేది ఏర్పడుతుంది. ఆకతాయి తనంతోనో, తెలిసో తెలియకో ఇలాంటి పనులు చేసే వారు కఠిన చట్టాలకు భయపడి అయినా ఇలాంటి పిచ్చి పనులకు దూరంగా ఉంటారు.