Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ అభిమానులకు సమ్మర్ స్ట్రోక్?

Tollywood

Tollywood

గత మూడేళ్లుగా బాక్సాఫీస్ వద్ద వేసవి సందడి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు, ఈ ఏడాదైనా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతాయని సినీ ప్రియులు ఆశపడ్డారు కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సమ్మర్ కూడా వెలవెలబోయేలా కనిపిస్తోంది. మండు వేసవిలో రావాల్సిన భారీ చిత్రాలు షూటింగ్ వాయిదాల వల్ల వర్షాలు పడే వరకు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి నెలాఖరు నుండి మొదలవ్వాల్సిన సందడిపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి, మార్చి 26న నాని ‘ది ప్యారడైజ్’, మార్చి 27న ‘పెద్ది’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇంకా పూర్తి కాకపోవడంతో, అవి మార్చిలో రావడం కష్టమేనని సమాచారం, ఒకవేళ ‘పెద్ది’ వాయిదా పడితే, అదే తేదీన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సమ్మర్ రేసులో ఉంటుందని ప్రచారం జరిగినా, మేకర్స్ నుండి ఇంకా స్పష్టమైన ప్రకటన రావడం లేదు.

Also Read :Nithiin : నితిన్ గట్టెక్కేనా?

సినిమాల విడుదలలో నెలకొన్న సందిగ్ధత ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది, మార్చి 19న యష్ ‘టాక్సిక్’, అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రాలతో పాటు, అదే రోజు ‘ధురంధర్’ సీక్వెల్ కూడా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ‘డెకాయిట్’ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మే 1వ తేదీన అడవి శేష్ ‘గూఢచారి-2’, అఖిల్ ‘లెనిన్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ ‘కొరియన్ కనగరాజు’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాలు కూడా సమ్మర్ బరిలోనే ఉన్నట్లు ప్రకటనలు వచ్చాయి, ఈ సమ్మర్ అట్రాక్షన్లలో అన్నిటికంటే ఆసక్తికరమైనది త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాలకు మాటలు అందించిన త్రివిక్రమ్, తొలిసారి వెంకీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, సమ్మర్‌లోనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది, అయితే మరో నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ‘గుమ్మడికాయ’ కొట్టడం గురూజీకి సవాల్‌తో కూడుకున్న విషయమే. మొత్తానికి, ఈ ఏడాదైనా సమ్మర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

Exit mobile version