వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నుంచి సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రస్తుతం 28 సినిమాల చిత్రీకరణలు జరుగుతుండగా, ఈ సమ్మె కారణంగా వాటి షూటింగ్ ఆగింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఈరోజు నుంచి యధావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలని కార్మికుల్ని కోరింది. లేకపోతే ఆరు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నిర్మాతలెవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దని సూచించింది.
మరోవైపు.. ఫెడరేషన్ సభ్యులు కూడా వెనక్కు తగ్గట్లేదు. వేతనాలు పెంచేంత వరకు షూటింగ్‌లకు హాజరు కామంటూ తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కంటే.. 45 శాతం ఎక్కువ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే.. నష్టపోయేది నిర్మాతలేనని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. అందుకే, దీన్ని పరిష్కరించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న తరుణంలో.. ఈ వివాదం నిర్మాతలకు మరో తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.
ఇదిలావుండగా.. తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నిర్మాతల తీరుపై మండిపడ్డారు. ప్రతీ హీరోకి పారితోషికాలు లక్షల్లో, కోట్లలో పెరుగుతోందని.. టికెట్ రేట్లు పెంచుకొని నిర్మాతలూ బాగానే సంపాదించుకుంటున్నారని.. కానీ కార్మికుల వేతనాల్ని పెంచమంటే మాత్రం కరోనాని సాకుగా చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇచ్చే కొద్దోగొప్పో వేతనాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.