Tollywood: న్యూ ఇయర్ సీనియర్ స్టార్ హీరోల చిత్రాల విజయంతో టాలీవుడ్ కు శుభ స్వాగతం లభించినట్టు అయ్యింది. జనవరిలో మొత్తం పదిహేను సినిమాలు విడుదల కాగా అందులో ఐదు డబ్బింగ్ చిత్రాలు. ఈ నెల మొదటి వారాంతంలో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ”ప్రత్యర్థి, మైఖేల్ గ్యాంగ్, ఏ జర్నీ టు కాశీ, దోస్తాన్’ సినిమాలు విడుదలైనా ఇందులో ఏ ఒక్కటీ తనదైన ముద్రను వేయలేదు. ఆంగ్ల అనువాద చిత్రం ‘కింగ్ డమ్ ఆఫ్ ది డైనోసార్స్’ కూడా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపలేదు.
సంక్రాంతి కానుకగా విడుదలయ్యే చిత్రాల సందడి జనవరి 11వ తేదీ నుండి మొదలైంది. 11వ తేదీ అజిత్ తమిళ అనువాద చిత్రం ‘తెగింపు’ జనం ముందుకు వచ్చింది. ఇదే రోజున రావాల్సిన విజయ్ ‘వారసుడు’ మూవీని నిర్మాత ‘దిల్’ రాజు వ్యూహాత్మకంగా 14వ తేదీకి వాయిదా వేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోటు పాట్లు, జరిగే మోసాల నేపథ్యంలో వచ్చిన ‘తెగింపు’ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించి, కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఆ మర్నాడే వచ్చిన నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ భారీ ఓపెనింగ్స్ సాధించింది. తండ్రీ కొడుకులుగా బాలకృష్ణ అభినయం, యాక్షన్ సన్నివేశాలు… మాస్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ మర్నాడు 13వ తేదీ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదలైంది. చిరంజీవి వింటేజ్ లుక్ ఈ మూవీకి ఓ ప్లస్ పాయింట్ కాగా, ‘థమాకా’ తర్వాత రవితేజ నటించిన చిత్రం కావడం మరో ప్లస్ పాయింట్ గా మారింది. భోగి రోజున సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ చిత్రం రిలీజ్ అయ్యింది. అదే రోజున విజయ్ ‘వారసుడు’గా తెలుగువారి ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ‘వారసుడు’లో కొత్తదనం పెద్దంత లేకపోయినా… దీనికి కూడా ఓ మాదిరి ఓపెనింగ్స్ వచ్చాయి. చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ మూవీతో పాటు బరిలోకి దిగిన మిగిలిన మూడు చిత్రాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. మొదటి వారాంతంలో బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ కలెక్షన్ల పరంగా టాప్ పొజిషన్ లో ఉండగా, రన్ లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ది పై చేయి అయ్యింది. ఈ రెండు సినిమాలలో ఒకటి వంద కోట్లు గ్రాస్, మరొకటి రెండు వందల కోట్ల గ్రాస్ మైలురాయిని దాటడం విశేషం. సాధారణ ప్రేక్షకులను ఈ రెండు సినిమాలు ఏ మేరకు ఆకట్టుకున్నాయనే విషయాన్ని పక్కన పెడితే, అభిమానులను మాత్రం ఆనందపరిచాయి. ఆ రకంగా సంక్రాంతి విజేతలుగా బాలకృష్ణ, చిరంజీవి నిలిచారు.
సంక్రాంతి సినిమాల సందడి దాదాపు ఆ తర్వాత వారంలోనూ కొనసాగింది. దాంతో మూడో వారాంతంలో ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఇక రిపబ్లిక్ డే కి ఒకరోజు ముందు షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా విడుదలైంది. సినిమా విడుదలకు ముందే తలెత్తిన వివాదాల కారణంగా కొన్ని థియేటర్ల దగ్గర ఉద్రిక్తత వాతావారణం నెలకొన్నా, ‘పఠాన్’కు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ను గురువారం విడుదల చేశారు. రిపబ్లిక్ డేనే విడుదలైన సుధీర్ బాబు ‘హంట్’ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దానితోపాటే వచ్చిన శివబాలాజీ ‘సిందూరం’ కూడా మెప్పించలేకపోయింది. జనవరి మొదటి వారాంతంలో ‘ఏ జర్నీ టు కాశీ’లో హీరోగా నటించిన చైతన్యరావ్ మరో సినిమా ‘వాలెంటైన్స్ నైట్’ జనవరి చివరి వారంలో విడుదలైంది. బట్… ఇది కూడా ప్రేక్షకులన్ని ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్ మాసంలో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించిన ‘మాలికాపురం’కు తెలుగులో ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని విడుదల చేసినా, సరైన థియేటర్లలో ఈ మూవీ పడలేదు. దాంతో ‘మాలికాపురం’ బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. మొత్తం మీద ‘వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి’ విజయాలతో చిత్రసీమలో ఓ కొత్త ఉత్సాహ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు.