Site icon NTV Telugu

Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్

Tollywood Straik

Tollywood Straik

తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ  సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్‌లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీల‌తో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించ‌గా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేన‌ని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఒకేసారి 30% పెంపు కష్టమని నిర్మాతల వర్గం స్పష్టం చేస్తోంది.

Also Read : Priyamani : బాలీవుడ్‌లో కలర్‌ బైయాస్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు – ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు ఫలితం లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. కృష్ణా నగర్‌లో ఈ రోజు నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. నిర్మాతల మండలి ప్రతిపాదన ప్రకారం, రోజువారీ వేతనం రూ.2,000 లోపు ఉన్న కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంపు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఈ పర్సెంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ తిరస్కరించి, ఒకేసారి 30% పెంపు తప్ప మేం అంగీకరించమని స్పష్టం చేసింది.

ఫెడరేషన్ ప్రకారం, నిర్మాతలు కొన్ని యూనియన్లను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. “నిర్మాతల షరతుల‌పై సుముఖంగా ఉన్నా, అవి దశలవారీగా కాకుండా వెంటనే అమలు కావాలి” అని ఫెడరేషన్ నేతలు చెబుతున్నారు. ఈ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని, భవిష్యత్ కార్యాచరణను ఈ రోజు నిరసనలో ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇక సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ఫలితంపై టాలీవుడ్ భవిష్యత్ షెడ్యూల్ ఆధారపడి ఉంది.

Exit mobile version