NTV Telugu Site icon

తనదైన అభినయంతో అలరించిన వై.విజయ

y vijaya

y vijaya

పసిమి ఛాయ, చారెడేసి కళ్ళు, కొనదేలిన ముక్కు, దొండపండులాంటి పెదాలు, ఇలా వర్ణించుకుంటూ పోతే మౌనుల నిగ్రహానికి సైతం పరీక్ష పెట్టే విగ్రహం వై.విజయ సొంతం. తెరపై వై.విజయను చూడగానే ‘పులుసు’ అంటూ కేకలు వేసేవారు జనం. “మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య” చిత్రాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకొనే పాత్రలో కనిపించారు వై.విజయ. అప్పటి నుంచీ ఆ పేరుతోనే ‘పులుసు’ విజయగా జనం మదిలో నిలచి పోయారు.

విజయ ఇంటి పేరు యెనిగండ్ల. 1957 ఫిబ్రవరి 8న కర్నూలులో వై.విజయ జన్మించారు. ఆమె తండ్రి జ్ఞానయ్య, తల్లి బాలమ్మ. జ్ఞానయ్య కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో మేనేజర్ గా పనిచేసేవారు. వారికి తొమ్మిది మంది సంతానం, ఐదుమంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు. వారి అయిదో సంతానంగా వై.విజయ జన్మించారు. నిజానికి వారి పూర్వికులది గుంటూరు జిల్లా. వై.విజయ కుటుంబం కడపకు మకాం మార్చారు. అక్కడే ప్రభుత్వ బాలికోతన్నత పాఠశాలలో వై.విజయ 8వ తరగతి వరకు చదువుకున్నారు. రేడియోలో సినిమా పాటలు వస్తూ ఉంటే, విని అందుకు తగ్గట్టుగా ఆమె నర్తించేవారు. కూతురుకు డాన్స్ పై ఉన్న మక్కువ గ్రహించి, జ్ఞానయ్య, ఆమెను మద్రాసులో వెంపటి చినసత్యం దగ్గర నృత్యంలో శిక్షణ ఇప్పించారు. మద్రాసులోని కేసరి హైస్కూల్ లో తొమ్మిది, పదో తరగతులు చదివారు విజయ.

చదువుతున్న సమయంలోనే యన్టీఆర్ తో కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘నిండు హృదయాలు’లో ఓ పాటలో నటించడానికి వై.విజయను ఎంచుకున్నారు. అందులో శోభన్ బాబుకు తల్లిగా నటించిన రుక్మిణి కష్టాల పాలయిన సమయంలో “ఏడు కొండల స్వామి… ఏడి ఏమాయె… సిలకా ఓ రామసిలకా…” పాటలో నటించారు విజయ. అదే తొలిసారి ఆమె తెరపై కనిపించడం. ఆ సమయంలోనే వై.విజయ నృత్యంలోనూ ప్రావీణ్యం సంపాదించారని తెలిసిన యన్టీఆర్ తాను నిర్మించి, నటించిన ‘శ్రీకృష్ణసత్య’లో వై.విజయకు జాంబవతి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. తరువాత తాను హీరోగా నటించిన ‘డబ్బుకు లోకం దాసోహం’లో చెల్లెలి పాత్రను ఇప్పించారు యన్టీఆర్. ఏయన్నార్ ‘విచిత్రబంధం’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు విజయ. “శ్రీకష్ణాంజనేయ యుద్ధం, గంగ-మంగ, ఛైర్మన్ చలమయ్య” వంటి చిత్రాలలో విజయ నటించారు. అలా వై.విజయ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ అలరించేవారు. తెలుగు, తమిళ చిత్రాల్లో పలు పాత్రలు పోషించారు. కె.బాలచందర్ రూపొందించిన ‘మన్మథలీల’లో నటించిన వై.విజయకు మంచి పేరు లభించింది. ఆ తరువాత అనేక తమిళ చిత్రాలలో నటించారామె. 1984లో బాలకృష్ణ హీరోగా ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన ‘మంగమ్మగారి మనవడు’తో ఆమెకు మళ్ళీ తెలుగునాట విశేషమైన పేరు దక్కింది. అప్పటి నుంచీ ‘పులుసు’గా అలరిస్తూ తనదైన బాణీ పలికించారు విజయ.

వై.విజయ కొన్ని సినిమాల్లో హాస్యాన్ని, మరి కొన్నిట వ్యాంప్ గానూ, ఇంకొన్నిట గయ్యాళిగానూ నటించి మురిపించారు. “మయూరి, ప్రతిఘటన, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, రేపటి పౌరులు, మగధీరుడు, లేడీస్ టైలర్ , అగ్నిపుత్రుడు, అల్లరి క్రిష్ణయ్య, సంకీర్తన, భలే మొగుడు, దొంగకోళ్ళు, స్టేషన్ మాస్టర్, కలియుగ పాండవులు, ఏప్రిల్ 1 విడుదల, స్వాతిముత్యం, యముడికి మొగుడు, నిప్పురవ్వ, సాహస సామ్రాట్, అమ్మోరు, గులాబీ, లింగబాబు లవ్ స్టోరీ, పెళ్ళి, సుస్వాగతం, శుభాకాంక్షలు, రాజా, తెనాలి రామకృష్ణ బిఏ.యల్.యల్.బి, ఎఫ్-2” చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ‘ఎఫ్-3’లోనూ వై.విజయ నటించారు. మళయాళ, హిందీ భాషల్లోనూ, కొన్ని టీవీ సీరియల్స్ లోనూ వై.విజయ నటించి అలరించారు. దర్శకుల్లో కోడి రామకృష్ణ, వంశీ ఆమెకు తగిన పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లో నటించి అలరించడానికి వై.విజయ సిద్ధంగా ఉన్నారు.