Tillu Square:సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని రెడీ చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ అయితే మరింత హైప్ ను క్రియేట్ చేసాయి. ఇక నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. డీజే టిల్లు కన్నా టిల్లు స్క్వేర్ లో వినోదం మరింతగా ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి అర్ధమవుతుంది.
టిల్లుకు పెళ్లి చేయడానికి చిన్నమ్మ పెళ్లికూతురు ఫోటో పట్టుకొని ఇంటికి రావడంతో ట్రైలర్ మొదలయ్యింది. ఇక అమ్మాయి గురించి వెటకారంగా మాట్లాడుతూనే తనకు పెళ్లి వద్దని చెప్పిన టిల్లు.. తన లవ్ స్టోరీ గురించి చెప్తూ కథ మొదలెడతాడు. పబ్ లో లిల్లీని కలవడం, సేమ్ రాధికాలానే కారులో ముద్దు.. ఇక దీంతో టిల్లు గాడికి కష్టాలు మొదలు. లిల్లీ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి మాఫియాతో టిల్లు యుద్ధం చేసినట్లు చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ను అద్భుతంగా రూపొందించారు. రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ తోనే ఆయన.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి భాగాన్ని మించి అలరించనున్నామనే నమ్మకాన్ని కలిగించగలిగారు. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.