పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు, పొరుగింటి పుల్లకూర… ఇలాంటివి హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ కి తెలియకపోవచ్చు! ఆయనకి తెలుగు రాదుగా! కాకపోతే, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మాత్రం సూపర్ హీరో ‘తోర్’కి ఆతని కొడుకే రుచి చూపించాడు!
అమెరికన్ సూపర్ హీరో యూనివర్స్ లో ‘తోర్’గా అందరికీ పరిచయమే క్రిస్ హెమ్స్ వర్త్. ఆయనకి మొత్తం ముగ్గురు పిల్లలు. అయితే, తన ఏడేళ్ల కొడుకుని క్రిస్ అడిగాడట ‘’పెద్దయ్యాక ఏం అవుతావ్?’’ అని! సమాధానంగా ‘’సూపర్ మ్యాన్’’ అన్నాడట బుడ్డోడు! తండ్రి ‘తోర్’ లాంటి సూపర్ హీరో అయినా సూపర్ మ్యానే నచ్చేశాడు సూపర్ కిడ్ కి! పాపం ‘తోర్’ అయితే మాత్రం క్రిస్ ఏం చేస్తాడు… ఇన్ స్టాగ్రామ్ లో సరదాగా పోస్టు పెట్టాడు!
సూపర్ మ్యాన్ డ్రస్ వేసుకున్న తన కొడుకుని నడిపించుకెళుతోన్న క్రిస్ హెమ్స్ వర్త్… ఆ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. తాను ఏమవుతావ్ అని అడిగితే ‘సూపర్ మ్యాన్’ అన్నాడని సరదాగా నెటిజన్స్ కు చెప్పాడు. అయితే, ‘’నాకు మరో ఇద్దరు పిల్లలున్నారు. వారికి ‘తోర్’ నచ్చుతాడేమో చూడాలి!’’ అని కూడా అన్నాడు!
‘తోర్’ అయినా మరోకటి అయినా… ‘’తండ్రి తండ్రే! సూపర్ మ్యాన్ సూపర్ మ్యానే!’’ అంటోన్న క్రిస్ హెమ్స్ వర్త్ వారసుడు నిజంగా పెద్దయ్యాక ఏమవుతాడో మరి!
A post shared by Chris Hemsworth (@chrishemsworth)