Site icon NTV Telugu

Das ka Dhamki: తెలుగు పాన్ ఇండియా సినిమాలన్నింటిదీ ఇదే పరిస్థితి!

Pan

Pan

Pan India: ఖచ్చితమైన ప్లానింగ్ లేకపోతే… జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో తమ చిత్రాలను విడుదల చేయడం అంత సులువు కాదనే విషయం ఇప్పుడిప్పుడే తెలుగు దర్శక నిర్మాతలకు అర్థం అవుతోంది. షూటింగ్ ప్రారంభం రోజున ‘పాన్ ఇండియా మూవీ తెరకెక్కించబోతున్నాం’ అంటూ డాంబికాలు పలుకుతున్న నిర్మాతలకు విడుదల తేదీ దగ్గరకు వచ్చే సరికీ తత్త్వం బోధపడుతోంది. మొన్నటి ‘దాస్ కా ధమ్కీ’ నుండి రేపు విడుదల కాబోతున్న ‘ఏజెంట్’ వరకూ ఇదే పరిస్థితి. ఈ మధ్య కాలంలో మనవాళ్ళకు పాన్ ఇండియా ఫీవర్ బాగా పట్టుకుంది. తాము ఎంచుకున్న కథ జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటుందో లేదో ఆలోచించకుండానే తమది ‘పాన్ ఇండియా మూవీ’ అని ‘పాన్ ఇండియా రిలీజ్’ అని ప్రచారం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే… చాలా సినిమాల కథలు గ్లోబల్ ఆడియెన్స్ ను ఆకట్టుకోలేవు. ఎవరి సెంటిమెంట్స్ వారివి, ఎవరి నేపథ్యం వారిది. ‘ఇందులో నేటివిటీ లేదు’ అంటూ మనమే చాలా సినిమాలను తిరస్కరిస్తూ ఉంటాం. అదే భావన పరాయి రాష్ట్రాల సినిమా ప్రేక్షకులకు మన సినిమాల పట్ల ఉంటుందని ఆలోచించం. ఒకవేళ అందరూ కనెక్ట్ అయ్యే కథలను ఎంపిక చేసుకున్నా, ప్రీ రిలీజ్ ప్లానింగ్ సరిగా చేసుకోకపోతే విడుదల సమయంలో చుక్కలు కనిపిస్తాయి. జాతీయ స్థాయిలో గుర్తింపులేని నటీనటులతో సినిమా తీసినప్పుడు వాటిని విస్తృతంగా ప్రచారం చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మనవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల మీద దృష్టి పెట్టినట్టుగా ఇతర రాష్ట్రాలపై పెట్టలేదు. నిజం చెప్పాలంటే అది అంత సులువు కూడా కాదు. అక్కడికీ ఇటు చెన్నయ్, అటు త్రివేండ్రమ్, అలానే బెంగళూరు, ముంబై లకు వెళ్ళి కొన్ని పాన్ ఇండియా మూవీస్ కు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ బజ్ చాలడం లేదు! అందుకే మన నిర్మాతలు ముందు తెలుగులో విడుదల చేసి ఆ తర్వాత ఇతర భాషలపై దృష్టి పెడదాం అనే నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ‘కాంతార’ సినిమాను కన్నడ నిర్మాతలు అలానే చేశారు. కన్నడంలో ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకున్నారు.
ఇప్పుడు తెలుగు నిర్మాతలూ అదే పంథాలో సాగబోతున్నారు. ఫిబ్రవరిలో వచ్చిన ‘మైఖేల్’, ‘థగ్స్’; మార్చి, ఏప్రిల్ లో వచ్చిన ‘దసరా, శాకుంతలం’ చిత్రాలు ఒకేసారి ఐదు భాషల్లో విడుదలై ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన నేపథ్యంలో ఆచితూచి అడుగులేయడం మొదలెట్టారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’ పాన్ ఇండియా మూవీగా ప్రచారం జరిగినా… మార్చి 22వ తేదీన కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న హిందీలో విడుదల చేశారు. ఇప్పుడు తమిళ, మలయాళ వర్షన్స్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఒకటి రెండు వారాల్లో ఇటు తమిళనాడు, అటు కేరళలో థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళబోతున్నారు. ఇదే పంథాలో మొన్నటి ‘విరూపాక్ష’ సాగబోతోంది. ఈ సినిమాను తొలుత తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అందుకుంది. దాంతో ఇతర భాషల్లో విడుదల చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఇక అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ దీ అదే పరిస్థితి. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, హిందీ నటుడు డినో మోరియా ఉన్నారు. కాబట్టి… ఈ రెండు భాషల్లోనూ దీన్ని చూడటానికి జనం ఆసక్తి చూపిస్తారు. అలానే ‘ఏజెంట్’ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం మరో ప్లస్ పాయింట్. బట్… పర్ ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా హడావుడిగా ఇతర భాషల్లో విడుదల చేయడం కరెక్ట్ కాదని నిర్మాత అనిల్ సుంకర భావించారు. రెండు మూడు వారాల తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ‘విరూపాక్ష’ మాదిరి ‘ఏజెంట్’ కూడా మంచి ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే… అది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలలో విడుదల సమయంలో నిర్మాతకు ఉపయోగపడుతుంది.

Exit mobile version