విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవ జరిగింది అంటూ జనం కోడై కూస్తున్నారు. కానీ, మనోజ్ విడుదల చేసిన వీడియోలోనూ వారిద్దరూ ఎక్కడా గొడవపడినట్టు లేదు. కేవలం వాయిస్ ఓవర్ లో వినిపించిన మంచు మనోజ్ వాయిస్ లో “ఇది సిట్యువేషన్… ఇది ఇళ్ళల్లోకి వచ్చి కొడుతూంటాడండి…మావాళ్ళని బందువులని…” అని వినిపించడం ఓ కారణం కాగా, “వాడేదో అన్నాడు కదా… ఒరేయ్ గిరేయ్…అని…”అంటూ మంచు విష్ణు అనడం కూడా అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగింది అంటూ వార్తలు రావడానికి కారణమయింది. ఈ వీడియోను మినహాయిస్తే అసలు అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది అన్నదానిపై ఎలాంటి సమాచారం అందడం లేదు. కొందరు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు కారణం అంటున్నారు. మరికొందరు రాజకీయ కోణాలూ ఉన్నాయని చెబుతున్నారు. ఇలా తలో మాట వినిపిస్తోంది.
నిజానికి మంచు బ్రదర్స్ – విష్ణు, మనోజ్ మధ్య మొన్నటి దాకా ఎంతో అనుబంధం ఉంది. వారిద్దరి అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిదో ఒకరిపై ఒకరు చెప్పుకొనే మాటల్లోనే తెలిసేది. “అసలు సినిమా రంగంలో తనకు పోటీ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది మనోజ్ అని, యాక్టింగ్ లో తన తమ్ముడి టైమింగ్ చూసి అదిరి పోతుంటానని” ఒకప్పుడు మంచు మనోజ్ తమ్ముని అభినందించారు. తన తమ్ముడు మహానటుడు యన్టీఆర్ తోనూ, నాన్నతోనూ కలసి ‘మేజర్ చంద్రకాంత్’లో నటించిన అదృష్టవంతుడనీ విష్ణు చెప్పేవారు. “అన్నయ్య అలా అంటాడు కానీ… టైమింగ్ అంటే ఆయనదే… నిజానికి కామెడీ చేయడం చాలా కష్టం… అలాంటిది ‘ఢీ’ సినిమాలో అన్నయ్య కామెడీ చేసిన తీరు అందరినీ కట్టిపడేసింది” అంటూ మనోజ్ కూడా తన అన్నయ్యను కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో మొన్న జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలోనూ అందరికీ తెలిసింది. ప్రకాశ్ రాజ్ పై పోటీగా నిలచిన తన అన్న మంచు విష్ణు గెలుపు కోసం, మనోజ్ సైతం పాటుపడ్డారు. తన అన్న మద్దతుదారులను ఓటింగ్ కు తీసుకురావడంలోనూ, వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలోనూ మనోజ్ ఎంతగానో శ్రమించారు. మనోజ్ తో పాటు ఈ రోజు ఆయన విడుదల చేసిన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు సారథి, గజ కూడా ఎన్నికల రోజున ఎంతగానో పాటుపడ్డారు. నిజానికి సారథిని మంచు విష్ణు కొట్టాడని వినిపిస్తోంది. అదేమీ జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మంచు విష్ణు, మనోజ్ ఇంటిపైకి వెళ్ళడానికి ఆస్తి తగాదా కారణమని కొందరు అంటున్నారు. ఇందులో ఏలాంటి వాస్తవం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే, మంచు విష్ణుకు 2013 నుండి దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న “స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ అండ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్స్”లో భాగస్వామ్యం ఉంది. అదే ఆయనకు ఎంతో సంపాదించి పెడుతోందని తెలుస్తోంది. కాబట్టి, తమ్ముడితో ఆస్తి తగాదాలు అన్న అంశానికే తావులేదని కొందరు అంటున్నారు.
మంచు మనోజ్ మొదటి వివాహం విడాకుల పాలయింది. ఇటీవలే ఆయన భూమా నాగిరెడ్డి చిన్నకూతురు భూమా మౌనికను పెళ్ళాడారు. అంతకు ముందు మనోజ్ పెళ్ళాడిన అమ్మాయి ప్రణతి రెడ్డి, మంచు విష్ణు భార్య వెరోనికాకు అత్యంత సన్నిహితురాలని సమాచారం. కారణాలు ఏవైనా కొన్నాళ్ళకే మనోజ్, ప్రణతి వివాహం విడాకులకు దారి తీసింది. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ఇక మనోజ్ ద్వితీయ వివాహంతోనే కొత్తగా అన్నదమ్ముల మధ్య గొడవలకు దారి తెరచుకుందని సమాచారం. ఎలాగంటే, మంచు విష్ణు భార్య వెరోనికా స్వయానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.జగన్మోహన్ రెడ్డి పినతండ్రి సుధీకర్ రెడ్డి కూతురు. జగన్మోహన్ రెడ్డితో విష్ణు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. పైగా విష్ణు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిని కలసి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చారు. తరువాత విజయమూ సాధించారు. ఈ నేపథ్యంలో విష్ణు వైసీపీకి అత్యంత సన్నిహితులు అని చెప్పొచ్చు. ఇక భూమా మౌనిక అక్క భూమా అఖిలప్రియ ఒకప్పుడు వైసీపీ టిక్కెట్ పై గెలుపొందారు. తరువాత తండ్రితో పాటు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. గతంలో నంద్యాల ఎమ్మెల్యే అయిన భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక సంభవించింది. అప్పుడు భూమా నాగిరెడ్డి అన్న శేఖర్ రెడ్డి తనయుడు బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో అఖిలప్రియ, ఆమె చెల్లెలు మౌనిక కూడా అన్న గెలుపుకోసం పాటుపడ్డారు. ఇప్పుడు కూడా అఖిలప్రియ, ఆమె పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ కోణంలో మనోజ్ భార్య మౌనిక తెలుగుదేశం పార్టీకి సన్నిహితురాలనే భావించాలి.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీ పరమయ్యాయి. కేవలం 19 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో మరో నాలుగు ఓట్లను క్రాస్ ఓటింగ్ తో సాధించి, మొత్తం 23 ఓట్లతో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధని గెలిపించుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీశ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. టీడీపీ వర్గాలు నిన్న సాయంత్రం నుండే సంబరాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మొదలై, తరువాత ఈ గొడవ చోటు చేసుకుందని వినిపిస్తోంది. పైగా 2019 ఎన్నికల్లో చంద్రబాబును తూలనాడుతూ మోహన్ బాబు రోడ్డుపై బైటాయించి మరీ వైసీపీకి ప్రచారం చేశారు. ఈ మధ్య చంద్రబాబుతో మోహన్ బాబు సన్నిహితంగా ఉంటున్నారనీ వినిపిస్తోంది. ఇవన్నీ క్రోడికరించి, మంచు బ్రదర్స్ మధ్య గొడవకు రాజకీయ కారణమూ ఉందని కొందరు అంటున్నారు.
ఏది ఏమైనా మంచు బ్రదర్స్ అన్నదమ్ముల అనుబంధం చూసి సినిమారంగంలో వారు కూడా అభినందించేవారు. అలాంటి అన్నదమ్ముల మధ్య గొడవలు తలెత్తినా,అవి టీ కప్పులో తుఫానులా సమసిపోతాయని, మళ్ళీ విష్ణు, మనోజ్ ఒక్కటవుతారనీ సినీజనం ఆశిస్తున్నారు.