లతా తండ్రి దీనానాధ్ కుటుంబం గోవాకు చెందింది. వాళ్ళ అసలు ఇంటి పేరు హర్దీకర్. అయితే పోర్చుగీసు వారి బారి నుండి కుల దైవాలను రక్షించుకోవడానికి రక్తం చిందించి, దేవుడికి రక్తాభిషేకం చేయడం వల్ల ఆ తర్వాత అభిషేకి అనేది ఇంటి పేరుగా మారింది. సాధారణంగా మగవాళ్ళ పేరు చివర భట్ అని వస్తుంది. దీనానాధ్ తండ్రి గణేశ్ భట్ అభిషేకీ ‘కర్ హదీ’ శాఖకు చెందిన బ్రహ్మణుడు కాగా, తల్లి యశుబాయి మరాఠా. రాణే కుటుంబానికి చెందినది. తల్లి ప్రోద్భలంతో సంగీతం నేర్చుకున్న దీనానాధ్ తన ప్రత్యేకత నిలపుకోవడానికి కొత్త ఇంటిపేరు పెట్టుకున్నాడు. తన గ్రామం పేరైన మంగేషీ పేరుమీదుగా మంగేష్కర్ అనే ఇంటి పేరు పెట్టుకుని ప్రముఖుడయ్యాడు. అతని 22వ యేట నర్మదాతో 1922లో వివాహం అయ్యింది.
Read Also : లతా మంగేష్కర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత ప్రసూతి సమయంలో నర్మదా మరణించడంతో 1927లో భార్య చెల్లెలు అయిన షెవాంతీతో దీనానాథ్ పునర్వివాహం జరిగింది. దీనానాధ్, షెవాంతీలకు 1929లో లతా మంగేష్కర్ జన్మించింది. చిన్నతనంలో అమ్మమ్మ దగ్గర కొంతకాలం పెరిగిన లతా మరాఠీ జానపద గీతాలతో పాటు గుజరాతీ పాటలూ నేర్చుకుంది. ఎందుకంటే ఆమె తల్లి షెవాంతీ గుజరాతీ మహిళ. తాపీ నది ఒడ్డున ఉన్న థాల్ నేర్ అనే చిన్న వూరు వాళ్ళది. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఈ గ్రామం 1910లో సంయుక్త మహరాష్ట్రలో ఉండేది. ఆ ఊరిలో నివసించే సేఠ్ హరిదాస్ రామ్ దాస్ లాడ్ అనే గుజరాతీ వ్యాపారస్థుడే లతా మంగేష్కర్ తాతయ్య. సో… ఆమె మాతృభాష ఏదీ అంటే గుజరాతీ అని చెప్పుకోవచ్చు.