NTV Telugu Site icon

The India Box Office Report-October: వెండి తెరను మురిపించి.. మెరిపించిన సం‘చలన’ చిత్రం..

The India Box Office Report October 2022

The India Box Office Report October 2022

The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది.

అక్టోబర్‌లో రిలీజైన అన్ని పిక్చర్లకూ కలిపి 772 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇందులో మేజర్‌ షేర్‌ మాత్రం కాంతార చిత్రానిదే. ఈ బొమ్మ.. కన్నడ భాషలో సెప్టెంబర్‌లోనే విడుదల కాగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మాత్రం అక్టోబర్‌లో వచ్చింది. అందువల్ల కాంతార కలెక్షన్ల గురించి సెప్టెంబర్‌ నివేదికతోపాటు అక్టోబర్‌ రిపోర్ట్‌లోనూ ప్రస్తావించారు.

కాంతర ఫిల్మ్‌.. అక్టోబర్‌లో భారతీయ వెండి తెరను మురిపించి.. మెరిపించి.. మైమరపించింది. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. ఈ సినిమా సెప్టెంబర్‌ మరియు అక్టోబర్‌లో అన్ని భాషల్లో కలిపి 346 కోట్లు సంపాదించింది. అక్టోబర్‌లో టాప్‌-10లో నిలిచిన చిత్రాల్లో కాంతార తర్వాత గాడ్‌ఫాదర్‌, రామ్‌సేతు, సర్దార్‌, బ్లాక్ ఆడమ్, థ్యాంక్‌గాడ్‌, ప్రిన్స్‌, డాక్టర్‌జీ, జయ జయ జయ జయహే, గంధద గుడి ఉన్నాయి.

read more: Digital Payments: ఇండియాలో డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు

కాంతార సినిమా అక్టోబర్‌లో అరుదైన ఘనత సాధించింది. 100 కోట్ల వసూళ్లు దాటిన వన్ అండ్ ఓన్లీ మూవీగా పేరొందింది. గాడ్‌ఫాదర్‌ 89 కోట్లు, రామ్‌సేతు 88, సర్దార్‌ 68, బ్లాక్‌ ఆడమ్‌ 59, థ్యాంక్‌ గాడ్‌ 39, ప్రిన్స్‌ 35, డాక్టర్‌జీ 30, జయ జయ జయ జయహే 24, గంధద గుడి 23 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. అక్టోబర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్లు 9 వేల 24 కోట్ల రూపాయలకు చేరాయి.

కాంతార మూవీకి వచ్చిన మొత్తం డబ్బు 346 కోట్లలో దాదాపు 47 శాతం ఒక్క కన్నడ భాషలోనే రావటం విశేషం. మిగిలిన 53 శాతంలో హిందీ వెర్షన్‌ లీడింగులో నిలవటం చెప్పుకోదగ్గ విషయం. కాంతార చిత్రం.. ఈ ఏడాది మొత్తమ్మీద.. కలెక్షన్ల విషయంలో నంబర్‌-3 ర్యాంకు పొందింది. మొదటి రెండు స్థానాల్లో కేజీఎఫ్‌ చాప్టర్‌-2 మరియు ట్రిపుల్‌ ఆర్‌లు ఉన్నాయి.

నవంబర్‌ మరియు డిసెంబర్‌ నెలల్లో ఆడియెన్స్‌ ముందుకు వచ్చే మూవీలు కనీసం 19 వందల 24 కోట్ల రూపాయలు రాబట్టాయంటే 2022 సంవత్సరం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘‘ది బెస్ట్’’గా నిలుస్తుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేస్తుంది. 10 వేల 948 కోట్ల రూపాయలతో ఈ రికార్డు ఇప్పటివరకు 2019వ సంవత్సరం పేరిటే ఉండిపోయింది.

సెప్టెంబర్‌ దాక ఉన్న డేటా మేరకు ఈ ఏడాది టాప్‌-10 పిక్చర్ల లిస్టులో 3వ స్థానంలో పొన్నియన్‌ సెల్వన్‌ ఉండేది. కానీ.. అక్టోబర్‌లో అప్‌డేట్‌ చేసిన రిపోర్టులో 3వ స్థానాన్ని కాంతార ఆక్రమించటం గమనించాల్సిన అంశం. దీనివల్ల పొన్నియన్‌ సెల్వన్‌ ర్యాంక్‌ 3 నుంచి 4కి పడిపోయింది. సెప్టెంబర్‌లో టాప్‌-10 లిస్టులో అట్టడుగున ఉండిపోయిన గంగూబాయి కతియావాడి మూవీ ఈసారి కాంతార ఎంట్రీతో మాయమైంది.

జనవరి నుంచి అక్టోబర్‌ వరకు దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని సినిమాల కలెక్షన్లను భాషల వారీగా పరిశీలిస్తే కన్నడ చిత్రాల వసూళ్ల వాటా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 9 శాతానికి పెరిగింది. కేజీఎఫ్‌ చాప్టర్‌-2 మరియు కాంతార బిగ్‌ సక్సెస్‌ అవటంతో కన్నడ మూవీల కలెక్షన్లు ఆల్‌టైం హైలెవల్‌ను చేరుకున్నాయి. సెప్టెంబర్‌ నాటికి ఈ షేరు 8 శాతంగా నమోదైంది. 2019తో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు కావటం విశేషం.

ఇక.. ఈ 10 నెలల వసూళ్లలో మెజారిటీ వాటా హిందీ చిత్రాలదే. ఆ తర్వాత.. తెలుగు సినిమాలున్నాయి. హిందీ మూవీల షేరు 33%గా, తెలుగు చిత్రాల వాటా 22%గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ వసూళ్లలో 37% తెలుగు, తమిళ, కన్నడ సినిమాలను ఆ భాషలోకి డబ్బింగ్‌ చేయటం వల్ల వచ్చినవే. ఇదిలాఉండగా తమిళ పిక్చర్ల షేరు సెప్టెంబర్‌ వరకు 19%గా ఉండగా అక్టోబర్‌ నాటికి 18%కి పడిపోయింది.

Show comments