సౌత్ కొరియన్ యాక్టర్ ఓ యెంగ్ సూ ఎమ్మీ అవార్డ్స్ లో నామినేషన్ దక్కించుకున్నా, అవార్డు గెలుచుకోలేక పోయారు. అయితేనేమి జనం మదిని 77 ఏళ్ళ యెంగ్ సూ గెలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ కొరియన్ డ్రామా సిరీస్ ‘స్క్విడ్ గేమ్’లో ఓ యెంగ్ సూ కీలకమైన ‘ఓ ఇల్ నామ్ 001’ అనే పాత్రను పోషించారు. ఇందులో 001 పాత్ర బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతూ ఉంటుంది. అయినా చావును ఎదిరించడానికి గేమ్ ఆడే పాత్ర. దానిని యెంగ్ సూ సమర్థవంతంగా పోషించడంతో ఎమ్మీ అవార్డ్స్ లో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గా ఆయనకు నామినేషన్ లభించింది. అయితే ‘సక్సెసన్’లో నటించిన మేథ్యూ మ్యాక్ ఫాడెన్ కు అవార్డు సొంతమయింది. ఆ అవార్డుల వేడుకలో యెంగ్ సూ కూడా పాల్గొన్నారు. తనకు అవార్డు దక్కకపోయినా ఏ మాత్రం చింతించకుండా ఎమ్మీ అవార్డ్స్ వేడుకలో యెంగ్ సూ డాన్స్ చేయడమే ఇప్పుడు నెటిజన్స్ ఆయనకు జై కొట్టేలా చేసింది.
ఎమ్మీ అవార్డ్స్ లో డాన్స్ చేస్తున్న ఓ యెంగ్ సూ వీడియో వైరల్ అవుతోంది. ఆయన డాన్స్ చూసి నెటిజన్స్ పొంగిపోతూ ‘స్పిరిట్’ అంటే అదీ అంటున్నారు. ఎంతయినా ఆయన 001 కదా- అవార్డు వచ్చినా, రాకపోయినా ఒకే విధంగా ఉంటారు అంటూ కితాబు నిస్తున్నారు. ‘స్క్విడ్ గేమ్’ను చూడని వారు సైతం ఇప్పుడు ఓ యెంగ్ సూ డాన్స్ చూశాక, ఆయన పాత్రకోసమైనా ఆ సీరిస్ చూడాలని తపిస్తున్నారు.