Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!

Aaaaa

Aaaaa

తెలుగు సినీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో (బై ఎలక్షన్స్) విజయం సాధించిన నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించగా, ప్రముఖ నిర్మాతలు TG విశ్వప్రసాద్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ.. “యూనియన్‌లో పక్కాగా కార్యవర్గం ఉండాలనే బై-లాస్ నిబంధనలకు లోబడే ఈ ఉప ఎన్నికలు నిర్వహించాం. ఎవరినీ ఎదిరించడానికి లేదా పోటీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. గెలిచిన ప్రతినిధులు షూటింగ్స్ లేని సమయంలో అందుబాటులో ఉంటూ, డాన్సర్స్ సంక్షేమానికి, యూనియన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

అసోసియేషన్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన తడివేలు (ఇశ్రాయేలు పిట్ట) మాట్లాడుతూ.. “మా యూనియన్ చరిత్రలోనే సుమలత గారిలాంటి దృఢమైన నాయకురాలిని, అధ్యక్షురాలిని చూడలేదు. డాన్సర్ల హక్కుల కోసం, సంక్షేమం కోసం ఆమె నిలబడుతున్న తీరు అభినందనీయం. నిజంగా ఆమె మా డాన్సర్స్ పాలిట ఇందిరా గాంధీ లాంటివారు” అని ప్రశంసించారు.

నూతన ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారికి గానీ, ఫెడరేషన్‌కు గానీ మేము ఎప్పుడూ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ కొన్ని మీడియా ఛానెళ్లు అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాయి. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇచ్చిన ₹40 లక్షలు, జానీ మాస్టర్ ఇచ్చిన ₹18 లక్షల నిధులను త్వరలోనే సభ్యుల బీమా (ఇన్స్యూరెన్స్) రూపంలో కేటాయిస్తాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఫెడరేషన్ మద్దతు కావాలని కోరుతున్నాం. మేము బై-లాస్ ప్రకారమే నడుచుకుంటున్నాం” అని స్పష్టం చేశారు.

ప్రముఖ నిర్మాత TG విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “నిర్మాతలుగా మేము ఇచ్చే వేతనాలు మధ్యవర్తులకు వెళ్లకుండా నేరుగా డాన్సర్లకే అందాలని సుమలత గారు చేస్తున్న పోరాటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఆమెకు మద్దతుగా ఇక్కడికి వచ్చాను. త్వరలో నా నిర్మాణంలో రాబోయే సినిమాల్లో 100 శాతం హైదరాబాద్ డాన్సర్లకే అవకాశం కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు.
దీనికి తోడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందిస్తూ, సాధ్యమైనంత వరకు ముంబై డాన్సర్లను పక్కన పెట్టి మన స్థానిక తెలుగు డాన్సర్లకే ప్రాధాన్యమిస్తానని, తన పాటల్లో లోకల్ టాలెంట్‌కే మొదటి పీట వేస్తానని వెల్లడించారు.
అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.