వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు కాగా, మెగా ఫినాలేకు చిరంజీవి వచ్చారు. దాంతో ఈ షోలో ఆయన పాటలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. షో ప్రారంభంలో చిరంజీవి గెటప్ లోనే కంటెస్టెంట్స్ వచ్చి ఆయన సినిమా పాటలు పాడారు. దాంతో చివరి రోజు పార్టిసిపేట్ చేసిన ఐదుగురు సింగర్స్ కు చిరంజీవి చిరు బహుమతులు ఇచ్చారు. ఈ షోలో తన ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసిన శ్రీనివాస్ ధరిమిశెట్టితో పాటు అతని కాబోయే భార్య స్నేహనూ వేదిక మీదకు పిలిచి చిరంజీవి పట్టుబట్టలు అందించారు. ఆ తర్వాత ప్రణతికి పెన్ బహుమతిగా ఇచ్చి తొలి ఆటోగ్రాఫ్ తానే తీసుకున్నారు. గాయని గానే కాదు నటిగానూ అవకాశాలు అందుకుంటున్న వాగ్దేవికి అద్దాన్ని ప్రెజెంట్ చేశారు. జయంత్ కు బ్లాక్ గాగుల్స్ ఇచ్చి రజనీకాంత్ స్టైల్ లో దానిని పెట్టుకోమని ఎంకరేజ్ చేశారు. వైష్ణవికి వాచ్ ఇవ్వడంతో పాటు ‘గాడ్ ఫాదర్’ మూవీలో పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. అలానే చిరంజీవి సినిమాకు పాట పాడాలని ఉందన్న శ్రీరామ్ చంద్ర కోరికను తీర్చుతూ ‘గాడ్ ఫాదర్’లోనే పాట పాడిస్తానని హామీ ఇచ్చారు. ఈ చివరి షోలో జడ్జెస్ అయిన నిత్యామీనన్, కార్తీక్, తమన్ సైతం తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
తెలుగు ఇండియన్ ఐడల్ లో మొదటి మూడు స్థానాల్లో శ్రీనివాస్ ధరిమిశెట్టి, వైష్ణవి, వాగ్దేవి నిలిచారు. వీరిలో విజేత పేరును మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి విజేతగా నిలిచింది. ఆమెకు ఆహా సంస్థ బిగ్ ట్రోఫీతో పాటు పది లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందించింది. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన చందనా బ్రదర్స్ మూడు లక్షలు, తెనాలి డబుల్ హార్స్ సంస్థ మూడు లక్షల ప్రైజ్ మనీని అందించింది. ఫస్ట్ రన్నరప్ శ్రీనివాస్ ధరిమిశెట్టికి ఆహా రూ. మూడు లక్షల ప్రైజ్ మనీని, చందనబ్రదర్స్ రెండు లక్షల రూపాయల చెక్ ను అందించింది. సెకండ్ రన్నరప్ వైష్ణవికి ఆహా సంస్థ రెండు లక్షల ప్రైజ్ మనీ ఇవ్వగా, చందన బ్రదర్స్ రూ. లక్షరూపాయల బహుమతిని అందించింది. ఆహా తొలిసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఫినాలేకు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. విజేతకు తమ గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా తొలి అవకాశం ఇవ్వాలని అనుకున్నామని, అందుకే వాగ్దేవితో అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పి, ఆ కాగితాలను ఆమె చేతికి అరవింద్ అందించారు. న్యాయనిర్ణేతలతో పాటు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడీ షో సెకండ్ సీజన్ కోసం ఇప్పటి నుండే వీక్షకులు ఎదురుచూస్తున్నారు.