గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న పర్సెంటేజ్ వివాదానికి ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో రకరకాల లీకులు, డ్రాఫ్ట్‌లు ఇండస్ట్రీ వర్గాల్లో గందరగోళం సృష్టించిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు రంగంలోకి దిగారు. ఆయన సంతకంతో కూడిన ఒరిజినల్ ప్రెస్ నోట్‌ను ఛాంబర్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఇంతకుముందు నా సంతకం లేకుండా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టిన లేఖలన్నీ ముమ్మాటికీ ఫేక్ అన్న సురేష్ బాబు అదే సమాచారాన్ని సంతకంతో అఫీషియల్ ప్రెస్ నోట్ ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసింది.
ఇండస్ట్రీలో లాంగ్ రన్ కోసం తీసుకురావాలని భావిస్తున్న కొత్త పర్సెంటేజ్ సిస్టమ్‌పై కూడా కాలపరిమితిని నిర్దేశించారు. నిర్మాతలు సమర్పించిన అన్ని రకాల షరతులు, కండిషన్లపై కమిటీ కూలంకషంగా చర్చించనుంది. రాబోయే తదుపరి భారీ సినిమా విడుదలకు ముందే లేదా 2026 జూన్ చివరి నాటికి ఈ సరికొత్త పర్సెంటేజ్ విధానాన్ని పూర్తిగా ఫైనల్ చేయాలని డెడ్‌లైన్ విధించారు. ఫిల్మ్ ఛాంబర్ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటికీ, ఈ అంశంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాంబర్ విడుదల చేసిన లేఖలో ఉన్న ప్రతీ అంశాన్ని తాము తెలంగాణ ఎగ్జిబిటర్ల ముందుకు తీసుకెళ్తామని, వారందరితో లోతుగా చర్చించి, వారి అభిప్రాయాలు మరియు గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తమ తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని శ్రీధర్ స్పష్టం చేశారు. దీంతో, ఛాంబర్ అధికారికంగా లైన్ క్లియర్ చేసినా, రాబోయే రోజుల్లో తెలంగాణ థియేటర్ ఓనర్ల అంతర్గత సమావేశం ఈ వివాదంలో ఎలాంటి మలుపు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
