తెలంగాణ రాష్ట్రంలో సోమవారం (జూన్ 13న) పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులకు వీడ్కోలు పలికి, బోధనకు తెరతీశాయి. ఈ విద్యా సంవత్సరం పిల్లలకే కాదు, పంతుళ్ళకు కూడా పరీక్షనే! ఎందుకంటే ఈ యేడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశారు. ఇది భాషాభిమానులకు బాధ కలిగిస్తున్న విషయమే! అయితే ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న సమయంలో పరభాషల మీద ద్వేషం మాని, పలు భాషలు నేర్చే దిశగా మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. అందుకు ప్రపంచభాషగా చెలామనీ అవుతోన్న ఆంగ్లం అసలైన మాధ్యమంగా నిలుస్తోంది. మన మాతృభాష కరిగిపోకుండా, ఇతర భాషలను నేర్చుకోవడానికి అనుగుణంగానూ ఇంగ్లిష్ రాజ్యమేలుతోంది. అందువల్లే మన చుట్టుపక్కలే ఉన్న భాషలు మనకు తెలియకపోయినా, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసి ఆనందిస్తున్నాం. మన భాషలు మనుగడలో ఉండటానికి ఇంగ్లిష్ పరోక్షంగా సహకరిస్తోందన్న మాట! అందుకు మన సినిమాలే వేదిక అవుతున్నాయన్నదీ మరువరాదు.
భాష అన్నది జీవనదిలాంటిది. పరభాషలు వేసవిలా వచ్చి, మన జీవనదిని ఎండగడతాయి అని భయపడరాదు. ఆ భాషలనూ మనలో కలుపుకుంటూ పోతూ ఉంటే, వాటితో పాటు మన భాషలూ సదా రుచికరంగానే ఉంటాయి. అందుకు మన సినిమాల్లోని సాహిత్యం ఓ సాధనంగా మారుతోంది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో తెలుగు కనిపించడం లేదు అని ఎంరరో వాపోతుంటారు. అలా బాధ పడుతున్న వారిలో ఎందరికి “ఎకిమీడా…”(గౌతమీపత్రశాతకర్ణి), “కొర్రాసు నెగడు…” (ట్రిపుల్ ఆర్) అన్న పదాలకు అర్థం తెలుసు? ఆ పాటలు వినడం వల్లే కదా, మన మాతృభాషలోని మాధుర్యం మనకు తెలిసింది. తాజాగా ‘విరాటపర్వం’ సినిమాలో ” నిప్పు ఉంది… నీరు ఉంది…” పాటలోనూ “నగాదారిలో,…” అనే పదం కూడా ఎంతోమంది భాషాభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదే తీరున మన జానుతెలుగులోని పదాలను పాటల్లో పొందు పరచడానికి దర్శకనిర్మాతలు తమ రచయితలు, గీతరచయితలకు తగిన స్వేచ్ఛనివ్వాలి. అప్పుడు మన భాష కూడా పరుగులు తీస్తుంది. పైగా దేశవిదేశాల్లోని తెలుగువారికి ‘ఇంగ్లిష్ సబ్ టైటిల్స్’ ద్వారా మన పదాలకు ఈ తరం పిల్లలు అర్థం తెలుసుకొనే అవకాశమూ ఉంది. కేవలం సినిమాలే కాకుండా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా విజృంభిష్తున్న తరుణంలో భాషపై శ్రద్ధ పెట్టాలే తప్ప, భయపడరాదు.
మన తెలుగు సినిమా ‘ట్రిపుల్ ఆర్’ను చూసి ‘డాక్టర్ స్ట్రేంజ్’ (2016) చిత్ర రచయితల్లో ఒకరైన సి.రాబర్ట్ కార్గిల్ ఎంతగానో పులకించి పోయారు. అంతేకాదు, మరోమారు ‘ట్రిపుల్ ఆర్’ను చూడాలనే అభిలాషనూ ఆయన వ్యక్తం చేశారు. మరి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ వల్లే కదా హాలీవుడ్ రైటర్ ను సైతం మన ‘ట్రిపుల్ ఆర్’ ఆకట్టుకోగలిగింది. కావున మన భాష ఏదో అయిపోతుందని భయపడవలసిన పనిలేదు.
చివరగా ఒక్క మాట, హిందీని జాతీయ భాషగా నిలపాలని 75 సంవత్సరాలుగా భాషాభిమానులు కృషిచేస్తూనే ఉన్నారు. కానీ, ఆంగ్ల భాష ఆధిపత్యం ఈ నాటికీ సాగుతోంది. కొన్ని విదేశాలలో తమ మాతృభాషకే పట్టం కడుతున్నారు. ఆ పాటి జ్ఞానం మనవారికి లేదంటూ భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేయవచ్చు. అభివృద్ధి చెందే దేశాలకు ఒక అధికార భాష అంటూ ఉండకూడదనే భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. భూలోక స్వర్గంగాకీర్తినొందిన స్విట్జర్లాండ్ లో అధికార భాష అంటూ ఒక్కదానినే పట్టుకొని వేలాడడం లేదు. పైగా మునుపటితో పోలిస్తే మన జాతీయ భాష హిందీ ఇప్పుడే అత్యధికులను ఆకర్షిస్తోంది. అదే బాటలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, వంగ, మరాఠీ తదితర భాషలు కూడా సాగగలవు. ‘పాన్ ఇండియా’ మూవీస్ తో మన దేశంలోనే మన భాషలకు విలువ పెంచుకుంటున్నాం. అదే తీరున ‘పాన్ వరల్డ్ మూవీస్’ దిశగా అడుగులు వేస్తే మన భాషలను ప్రపంచ వ్యాప్తం చేయడం కష్టతరమేమీ కాదు. భాషాభిమానులూ… మన సినీజనాన్ని మన భాషకు పట్టం కట్టమని బోధించండి! అలాగే ఉపాధ్యాయులు సినిమాల ద్వారా, ముఖ్యంగా సబ్ టైటిల్స్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకొనే అంశాన్ని పిల్లలకు బోధించాలి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై కూడా జనానికి, వారి పిల్లలకు ఆసక్తి కలగక మానదు. ఇక వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి పిల్లలను కార్పోరేట్ స్కూళ్ళలో బందీలను చేయవలసిన అవసరమూ ఉండదు. ఎటొచ్చీ మన సినిమాల్లో అశ్లీలం, అసభ్యతలకు తావివ్వకుండా బాలలను ఆకట్టుకొనే కథాంశాలను జోడించవలసిన బాధ్యత సినీజనం తీసుకోవాలి.