Telangana State Film Chamber: సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో పాటు ‘దిల్’ రాజు నిర్మించిన అనువాదచిత్రం ‘వారసుడు’ సైతం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి అనువాద చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వరాదంటూ ఎగ్జిబిటర్స్ ను కోరింది. ఈ విషయమై మంగళవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో చర్చ జరిగింది. ఈ వివరాలను సంస్థ ట్రెజరర్, ప్రముఖ ఎగ్జిబిటర్ విజయేందర్ రెడ్డి తెలియచేశారు.
ఆయన మాట్లాడుతూ, ”డబ్బింగ్ సినిమాలను ఆపడం అనేది కుదరదు. మన సినిమాలు ఇతర భాషల్లోనూ, ఇతర భాషా చిత్రాలు మన తెలుగులోనూ ఎంతో కాలంగా డబ్ అవుతున్నాయి. అయితే… మా తొలి ప్రాధాన్యం ఎప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలకే ఉంటుంది. ఇదే సమయంలో గుర్తించాల్సిన మరో విషయం ఏమంటే… ఇది వ్యాపారంతో కూడుకున్న పరిశ్రమ. మాకు రెగ్యులర్ గా ఏ పంపిణీదారుడు ఎక్కువగా సినిమాలను ఇస్తారో అతనితోనే మా ప్రయాణం సాగుతుంటుంది. అతను ఇచ్చిన సినిమాలకే మేం ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు మా వ్యాపార భాగస్వామితో ఉండే అనుబంధం దృష్ట్యా వారిచ్చే సినిమాలను ప్రదర్శిస్తాం” అని అన్నారు. అలానే ఈ రోజు జరిగిన మీటింగ్ లో ‘లైగర్’ విషయమూ చర్చకు వచ్చిందని చెప్పారు. ఈ సినిమాను తెలంగాణాలో పంపిణీ చేసిన వరంగల్ శ్రీను… మూవీ పరాజయం పాలైన కారణంగా కొంత మొత్తాన్ని నిర్మాతల నుండి వెనక్కి ఇప్పించాల్సిందిగా ఛాంబర్ ను కోరారని, ఈ విషయాన్ని దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ దృష్టికి తాము తీసుకెళ్ళి, వారు ఇచ్చే మొత్తాన్ని ఛాంబర్ లో డిపాజిట్ చేయమని కోరబోతున్నామని విజయేందర్ రెడ్డి చెప్పారు. పూరి జగన్నాథ్ బిజీగా ఉన్న కారణంగా ఆయన నుండి అతి త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘లైగర్’ సినిమా ద్వారా నష్టపోయిన వారందరికీ పూరి జగన్నాథ్ ఇచ్చే మొత్తాన్ని పంచాలనుకుంటున్నామని అన్నారు. ఇది డిమాండ్ కాదని, కేవలం పూరి జగన్నాథ్ కు తమ వినతి అని ఆయన చెప్పారు.
