Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!

Ntv Breaking

Ntv Breaking

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుదలపై అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో, తెలంగాణ ప్రభుత్వం సరికొత్త జీవో జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీలకు అదనంగా డాల్బీ 7.1, 2K, 4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

అలాగే ప్రతి థియేటర్‌లో 25% సీట్లు నాన్-ప్రీమియం ఏర్పాటు చేయాల్సిందేనని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా రోజుకు నాలుగు షోలకు మాత్రమే రోజువారీ అనుమతి ఉండేది; అనుమతి తీసుకున్న సినిమాలకు మాత్రమే అదనంగా షో వేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఐదు షోలకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు.

అయితే ఇందులో ఒక మెలిక కూడా పెట్టారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదని చిన్న సినిమాల నిర్మాతలు గగ్గోలు పెడుతున్న క్రమంలో, పెంచిన ఒక షోను తప్పనిసరిగా చిన్న సినిమాలకు కేటాయించాలని పేర్కొన్నారు.
అదేవిధంగా ₹100 కోట్ల బడ్జెట్ పైబడిన సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్’ హోదా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి పొందిన సినిమాల నిర్మాతలు, నిబంధనల ప్రకారం పెంచి అమ్మిన లాభాల్లో 20% ఫిల్మ్ ఫెడరేషన్ సహా తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్‌కు జమ చేయాలంటూ ఒక నోటీసు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.