తెలుగు హీరోలు మార్కెట్ పెంచుకునే పనిలో… కోలీవుడ్ దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పి చాలా సార్లే చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా నుంచి నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ వరకూ ఎంతోమంది తమిళ దర్శకులు… కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసి ఫ్లాప్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలు రాయలేకపోవడం, మన ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేకపోవడమే ఇందుకు అతి పెద్ద కారణం. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ‘ఎస్ జే సూర్య’ కొమురం పులి, నాని లాంటి డిజాస్టర్స్ ని ఇచ్చాడు. తమిళనాడులో తుపాకీ, కత్తి, ఘజిని లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఏఆర్ మురగదాస్ తెలుగులో స్ట్రెయిట్ గా చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. చిరుతో స్టాలిన్, మహేశ్ బాబుతో స్పైడర్ సినిమాలు చేసిన మురగదాస్, స్పైడర్ సినిమాతో మహేశ్ ఫాన్స్ ని భయపెట్టినంత పని చేశాడు.
రీసెంట్ గా లింగుస్వామి ‘ది వారియర్’ సినిమాతో రామ్ పోతినేని అండ్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. కథ కథనాలు ఎటు ప్రయనిస్తున్నాయో కూడా అర్ధం కాని సినిమా చేశాడు లింగుస్వామి. ఇక లేటెస్ట్ గా ఈ లిస్టులో చేరాడు వెంకట్ ప్రభు. స్క్రీన్ ప్లేని కొత్తగా రాయడంలో, కథని కొత్తగా చెప్పడంలో దిట్ట అయిన వెంకట్ ప్రభుకి కోలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి దర్శకుడు నాగ చైతన్యతో కస్టడీ సినిమాని చేస్తున్నాడు అనగానే అక్కినేని ఫాన్స్ మంచి హిట్ సినిమా రాబోతుంది అనుకున్నారు. అక్కినేని అభిమానులకే కాదు రెగ్యులర్ ఫిల్మ్ లవర్స్ కి, తన తమిళ ఫాన్స్ కి కూడా షాక్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. కస్టడీ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు ఈ తమిళ దర్శకుల టెన్షన్ రామ్ చరణ్ కి కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి దిల్ రాజు బ్యానర్ లో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో భారి అంచనాలు ఉన్నాయి. శంకర్ మార్క్ కమర్షియల్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన కథతో గేమ్ చేంజర్ రూపొందుతోంది. గత కొంతకాలంగా శంకర్ ట్రాక్ రికార్డ్ అంతగా బాగోలేదు, దాని ఇంపాక్ట్ పడకుండా శంకర్ గేమ్ చేంజర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు కాబట్టి మెగా ఫాన్స్ కి టెన్షన్ పడాల్సిన అవసరం రాకపోవచ్చు. మరి మిగిలిన తమిళ దర్శకుల్లా శంకర్ కూడా షాక్ ఇస్తాడా లేక హిస్టరీ కొత్తగా రాస్తాడా అనేది చూడాలి. ఫ్లాప్ ఇచ్చిన తమిళ దర్శకులే కాదు నాగార్జునకి ‘గీతాంజలి’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మణిరత్నం లాంటి దర్శకులు కూడా ఉన్నారు. ఈ లిస్టులో శంకర్ చేరుతాడేమో చూడాలి.