టాప్ హీరోల నటవారసులు జనాన్ని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో తండ్రులను గుర్తుకు తెచ్చే పాత్రల్లో తప్పకుండా నటిస్తూ ఉంటారు. తెలుగునాట తొలి కౌబోయ్ హీరోగా పేరొందిన నటశేఖర కృష్ణ వారసుడు మహేశ్ బాబు కూడా అదే పంథాలో పయనించారు. మహేశ్ ను కౌబోయ్ గా చూపిస్తూ జయంత్ సి.పరాన్జీ స్వీయ దర్శకత్వంలో ‘టక్కరి దొంగ’ అనే ట్రెజర్ హంట్ మూవీని నిర్మించారు. పైగా ఒకప్పుడు కృష్ణ ‘టక్కరిదొంగ -చక్కనిచుక్క’ అనే చిత్రంలో నటించారు. అందులోని టైటిల్ లో సగం తన సినిమా పేరుగా చేసుకున్నారు జయంత్. అలా అభిమానులకు ఆనందం పంచుతూ 2002 జనవరి 12న సంక్రాంతి కానుకగా ‘టక్కరిదొంగ’ విడుదలయింది.
కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’లాగే ఈ చిత్రంలోనూ ఓ నిధి కోసం అన్వేషణ సాగుతుంది. ఆ సినిమాలో ఉన్నవారిని దోచేస్తూ, లేనివారికి పంచే పాత్రలో కృష్ణ కనిపించారు. అదే తీరున ఇందులోనూ మహేశ్ పాత్రను తీర్చిదిద్దారు. కథ విషయానికి వస్తే- షకీల్ అనే వాడు ఓ నిధి అన్వేషణలో సొంత తమ్ముణ్ణే చంపేస్తాడు. తరువాత ఆ నిధి ఎక్కడ ఉందో తెలిపే చిత్రం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికోసం వీరూ దాదాను వెంటాడుతాడు. షకీల్ నుండి తప్పించుకొనే ప్రయత్నంలో వీరు కాలు పోతుంది. 18 ఏళ్ళ తరువాత వీరు ఎక్కడ ధనం దొరుకుతుందో రాజా అనే అల్లరి దొంగకు తెలుపుతూ ఉంటాడు. తన సాహసంతో దోచుకున్న ధనంలో వీరుకు సగభాగం ఇస్తూ ఉంటాడు రాజా. పనస అనే అమ్మాయి కూడా చిల్లరదొంగ తనాలు చేస్తూ, రాజాను ఫాలో అవుతుంటుంది. నిధి మ్యాప్ కోసం తనను ఏ రోజునైనా షకీల్ చంపేస్తాడని భావించిన వీరు, తన కూతురు భవానీని రాజాకు అప్పగిస్తాడు. తమ ప్రయాణంలో రాజాకు ఓ ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు చూశాక అతనికి గతం జ్ఞాపకం వస్తుంది. ఓ నీచుడు డాక్టర్ అయిన తన తండ్రిని, అక్కను చంపాడని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుర్మార్గుడిని చంపాలన్నదే రాజా లక్ష్యంగా మారుతుంది. భవానీని షకీల్ బంధిస్తాడు. మ్యాప్ మంటల పాలవుతుంది. భవానీకి ఆ మ్యాప్ విషయం తెలుసు కాబట్టి, షకీల్ ఆమెను తనతో తీసుకువెళ్తానంటాడు. అదే సమయంలో రాజా తండ్రిని చంపినదెవరో తనకు తెలుసునని చెబుతాడు షకీల్. రాజా, నిధి అన్వేషణలో షకీల్ కు సహకరిస్తాడు. అతికష్టం మీద మొత్తానికి వజ్రాలు ఉన్న దీవి చేరుకుంటారు. అక్కడే షకీల్ చేయిపైని గుర్తు చూసి, తన తండ్రిని చంపేసింది వాడేనని గుర్తు పడతాడు రాజా. షకీల్ ను చంపేస్తాడు రాజా. చివరలో ఓ చోట మళ్ళీ పనస తగులుతుంది. అక్కడే ఆమె పక్కన మరో వ్యక్తి ఉంటాడు. అతనెవరు అని రాజాను భవానీ అడుగుతుంది. ‘ఆయన మోసగాళ్ళకు మోసగాడు’ అని చెప్పడంతో కథ ముగుస్తుంది.
మహేశ్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’లోనూ కృష్ణ ఓ కీలక పాత్ర పోషించి అలరించారు. దానిని దృష్టిలో పెట్టుకొనే ఇందులోనూ క్లయిమాక్స్ లో కృష్ణను చూపించి అభిమానులను అలరించారు జయంత్. ఈ చిత్రంలో రాజాగా మహేశ్ బాబు, భవానీగా లిసా రే, పనసగా బిపాషా బసు, షకీల్ గా రాహుల్ దేవ్, వీరూ దాదాగా అశోక్ కుమార్ నటించారు. మిగిలిన పాత్రల్లో తనికెళ్ళ భరణి, రాజాసింహా, రవి చలపతి కనిపించారు. ఓ కామెడీ రోల్ లో ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కూడా తెరపై తళుక్కుమన్నారు.
ఈ చిత్రానికి మణిశర్మ సమకూర్చిన సంగీతం ఎంతగానో అలరించింది. భువనచంద్ర, చంద్రబోస్ పాటలు రాశారు. “నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదులే…”, “అలేబా అలేబా…”, “హే మామా…”, “బాగుందమ్మో…” పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి మహేశ్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. కాగా, బెస్ట్ ఆడియోగ్రాఫర్ గా పి.మధుసూదనరెడ్డి, బెస్ట్ ఫైట్ మాస్టర్ గా విజయన్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా జైనన్ విన్సెంట్, ఉత్తమ బాలనటునిగా మాస్టర్ కౌశిక్ నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని అలరించిన కౌబోయ్ మూవీ ‘మెకనాస్ గోల్డ్’ చిత్రీకరించిన అమెరికాలోని కొలరాడో పర్వతప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ అధికంగా జరిగింది. ‘టక్కరిదొంగ’ అభిమానులను భలేగా అలరించింది.