‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే సంజయ్ రామస్వామి లాంటి పాత్రను మళ్లీ తీసుకురాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని, ఆ మాటపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సూర్య ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ‘గజినీ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని, వాటి సరసన ‘విశ్వనాథ్ & సన్స్’ కచ్చితంగా చేరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తల్లికొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని, థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ సినిమా బాగా నచ్చిందని, ఆయనకు నచ్చిన సినిమా తమ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఇప్పటివరకు ఫెయిల్ కాలేదని గుర్తుచేశారు. ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత కిక్ ఇచ్చిందో, ఈ సినిమాలో సూర్య పాత్ర కూడా ప్రేక్షకులకు అంతటి కిక్ ఇస్తుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.

