Suriya: ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు ఏమో కానీ.. హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని కొనలేరు. ముఖ్యంగా తెలుగు అభిమానుల అభిమనాన్ని కొనడం ఎవరి వలన కాదు. ఒక్కసారి మనసులో మా హీరో అనుకుంటే చాలు. ఆ హీరో తెలుగువాడా.. ? తమిళ్ వాడా.. ? హిందీ నుంచి వచ్చాడా.. ? కన్నడ నుంచి వచ్చాడా అని చూడరు. గుండెల్లో గుడి కట్టేస్తారు. ఇక వారి పుట్టినరోజు వచ్చిందంటే.. పండగ కన్నా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు.. ఫ్లెక్సీలు కడుతూ.. తమ హీరో గొప్పతనం గురించి మోత మోగిపోయేలా కేకలు పెడతారు. అయితే కొన్నిసార్లు వారి అత్యుత్సాహమే వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా హీరోల కోసం ఫ్లెక్సీలు కడుతూ.. చాలామంది అభిమానులు మృత్యువాత పడిన సంగతి తెల్సిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు సైతం నేడు ఫ్లెక్సీ కడుతూ మృతి చెందారు. నేడు సూర్య పుట్టినరోజును ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న అభిమానులకు ఈ వార్త విషాదంలోకి నెట్టింది.
Sarayu: బిగ్ బాస్.. టైమ్ వేస్ట్.. చూడకండి.. అక్కడ జరిగేది అదే
కోలీవుడ్ నుంచి వచ్చినా సూర్యకు అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం సూర్య సినిమాలు మాత్రమే కాదు.. అతని వ్యక్తిత్వం. ఎంతోమందికి అతను చేసే సాయం. అగారం ఫౌండేషన్ ద్వారా సూర్య ఎంతోమంది చిన్నారులను చదివిస్తున్నాడు. అతని వ్యక్తిత్వానికి తెలుగువారు కూడా ఫిదా అయిపోయారు. ఇక నేడు సూర్య పుట్టినరోజు కావడంతో.. ఆంధ్రప్రదేశ్, నరసరావుపేటలోని మోపువారిపాలెంలో నివసిస్తున్న సూర్య అభిమానులు అయిన నక్కా వెంకటేష్, పోలూరు సాయి సూర్య ఫ్లెక్సీలను కట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఫ్లెక్సీలు కట్టడానికి కరెంట్ స్తంభం ఎక్కగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో ఆ ఊరిలోనే కాదు సూర్య అభిమానులు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఎదిగి వచ్చిన కొడుకులు ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.