Site icon NTV Telugu

Surekha – Chiranjeevi : నాకు దోశలు వేయడం నేర్పించింది ఆయనే

Surekha

Surekha

Surekha – Chiranjeevi : నగరంలోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవార్డుల ప్రదానోత్సవం మధ్యలో యాంకర్ సుమ, చిరు దంపతులతో జరిపిన సరదా ముచ్చట్లు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

సోషల్ మీడియాలో చిరంజీవి అప్పుడప్పుడు ‘చిరు లీక్స్’ పేరుతో సినిమా లీక్స్ షేర్ చేస్తుంటారు. దీనిపై సుమ స్పందిస్తూ.. “సర్ సినిమాల గురించి లీకులు ఇస్తుంటారు, మరి మేడం కిచెన్ లీక్స్ ఏమైనా ఇస్తారా?” అని ప్రశ్నించారు. దీనికి సురేఖ నవ్వుతూ స్పందిస్తూ, ఇంట్లో దోశలు వేసే బాధ్యత (డిపార్ట్‌మెంట్) పూర్తిగా చిరంజీవి గారిదేనని వెల్లడించారు. “ఆయన దోశలు వేయడం కేవలం వీడియోల కోసం కాదు, అది ఆయనకున్న ఓన్ టాలెంట్. నిజానికి నాకు దోశలు వేయడం నేర్పించింది కూడా ఆయనే” అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

సురేఖ మాటలకు చిరంజీవి కూడా తనదైన శైలిలో చమత్కరించారు. “రోజు నేనే దోశలు వేస్తున్నానని అందరూ నిజం అనుకుంటారు.. ఊరుకో” అంటూ నవ్వుతూ వారించారు. అంతకుముందు ఉగాది వంటల గురించి ప్రస్తావిస్తూ.. పండుగ అంటేనే పులిహోర కదా, ఖచ్చితంగా ఇంట్లో వెరైటీలు చేసుకున్నామని సురేఖ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ దంపతులతో పాటు కింగ్ నాగార్జున, కొత్త జంట నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల కూడా సందడి చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు విజేతలకు అవార్డులు అందజేశారు. ఒకవైపు గద్దర్ స్మారక అవార్డుల భావోద్వేగ వాతావరణం, మరోవైపు సినీ తారల సందడితో హైటెక్స్ ప్రాంగణం మిరుమిట్లు గొలిపింది.

Exit mobile version