హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘అరణ్మై’ సీరిస్ చిత్రాలను తెరకెక్కించిన సుందర్ సి మళ్ళీ తనదైన శైలిలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను రూపొందించాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్ళిన కూల్ బ్రీజ్ మూవీ టైటిల్ ను సోమవారం ప్రకటించారు. జీవా, జై, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ‘కాఫీ విత్ కాదల్’ అనే పేరు ఖరారు చేశారు. మాళవిక శర్మ, ‘బిగిల్’ ఫేమ్ అమృత, తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఐశ్వర్య దత్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బెంజ్ మీడియాతో కలిసి అన్వీ సినీమాక్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. పాపులర్ టెలివిజన్ నటి దివ్య దర్శిని కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలలో బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త, యోగిబాబు, రెడిన్ కింగ్ స్లే, రైజా విల్సన్ కనిపించబోతున్నారు. ఈ సినిమా అత్యధిక భాగం షూటింగ్ చెన్నయ్, ఊటీలో జరిగింది. గతంలో సుందర్ సి దర్శకత్వం వహించిన ‘ఉల్లత్తై అల్లిత్త’ (తెలుగులో ‘వీడెవడండీ బాబు’గా రీమేక్ అయ్యింది) కూడా ఊటీ నేపథ్య చిత్రమే కావడం విశేషం.