ఇప్పుడంటే సుమన్ కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తున్నారు కానీ, ఒకప్పుడు ‘నవలానాయకుని’ లక్షణాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు. ఆరడుగులకు పైగా ఎత్తు, పసిమిఛాయ, నాజూగ్గా ఉండి, కరాటే మొనగాడు అనిపించుకున్నారు. దాంతో ఆ నాటి అమ్మాయిలలో ఎంతోమంది కలల రేడుగానూ సుమన్ సందడి చేశారు. తెలుగులోనే హీరోగా రాణించారు, ఆపై స్టార్ గానూ జేజేలు అందుకున్నారు సుమన్.
సుమన్ 1959 ఆగస్టు 28న మదరాసులో జన్మించారు. సుమన్ కన్నవారు ఇద్దరూ విద్యాధికులు. ఆయన తల్లి కేసరి చంద్ర మద్రాసులోని యతిరాజ్ కాలేజ్ ఫర్ విమెన్ కు ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఆయన తండ్రి సుశీల్ చంద్ర మదరాసులోని ఐ.ఓ.సి.లో ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించారు. చెన్నైలోని బీసెంట్ థియోసాఫికల్ హై స్కూల్ లో సుమన్ చదువు సాగింది. బి.ఏ., ఇంగ్లిష్ లిటరేచర్ చదివారు. సుమన్ కు సంగీతం అంటే ఎంతో ప్రీతి. దాంతో సంగీతం, సంస్కృతం అభ్యసించారు. 1979లో ‘నీచల్ కులమ్’ అనే చిత్రంతో సుమన్ తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆ తరువాత పలు తమిళ చిత్రాలలో నటిస్తూ సాగారు. నటుడు భానుచందర్ సుమన్ కు మంచి స్నేహితుడు. అతని ద్వారా సుమన్ గురించి తెలుసుకున్న తమ్మారెడ్డి భరద్వాజ తాను నిర్మించిన ‘ఇద్దరు కిలాడీలు’లో సుమన్ ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా కంటే ముందు కోడి రామకృష్ణ దర్శకత్వంలో సుమన్ హీరోగా ‘తరంగిణి’ చిత్రం విడుదలయింది. తొలి సినిమాతోనే సుమన్ తెలుగువారికి చేరువయ్యారు. ఆ చిత్రం స్వర్ణోత్సవం జరుపుకుంది. తరువాత ‘నేటి భారతం’ కూడా రజతోత్సవాలు చూడడంతో సుమన్ తెలుగునాట స్టార్ హీరోస్ లో ఒకరిగా గుర్తింపు సంపాదించారు. అప్పటి నుంచీ తెలుగు చిత్రాలకే ప్రాధాన్యమిస్తూ సాగారు సుమన్. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగునాట విజయపథంలో పయనించాయి. “మెరుపుదాడి, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు, సితార, దేశంలో దొంగలు పడ్డారు, నేరం నాదికాదు, పెద్దింటి అల్లుడు, ఖైదీ ఇన్ స్పెక్టర్, బావ-బావమరిది” వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. వీటిలో ‘బావ-బావమరిది’ చిత్రం ద్వారా ఉత్తమ నటునిగా నంది అవార్డునూ అందుకున్నారాయన.
‘అన్నమయ్య’ చిత్రంలో వేంకటేశ్వర స్వామి పాత్రను పోషించే అవకాశం లభించగానే, ఆయన దశ మారిపోయింది. కొన్ని పౌరాణిక పాత్రలు పోషించే ఛాన్స్ దక్కింది. ‘శ్రీరామదాసు’లో శ్రీరామునిగా, ‘దేవుళ్ళు’లో వేంకటేశ్వరునిగా, ‘గౌతమబుద్ధ’లో బింబిసారునిగా నటించారు. కెరీర్ ప్రారంభంలో ప్రతినాయక పాత్రలు పోషించిన సుమన్ తరువాత రజనీకాంత్ తో శంకర్ తెరకెక్కించిన ‘శివాజీ’లోనూ విలన్ గా మెప్పించారు. హీరోగా అవకాశాలు తగ్గగానే సుమన్ కేరెక్టర్ రోల్స్ వైపు టర్న్ తీసుకున్నారు. అప్పటి నుంచీ తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయంచేస్తూ సాగుతున్నారు.
ప్రముఖ తెలుగు రచయిత డి.వి.నరసరాజు మనవరాలు శిరీషను సుమన్ వివాహమాడారు. వారికి అఖిలజ ప్రత్యూష అనే అమ్మాయి. సుమన్ పుట్టినరోజయిన ఆగస్టు 28వ తేదీనే ప్రత్యూష జన్మించడం విశేషం! భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన ప్రత్యూష ఆ మధ్య అరంగేట్రం చేశారు. హీరోయిన్ లాగా కనిపించే ప్రత్యూష కూడా తండ్రి బాటలో నడుస్తుందా అని చాలామంది ఆలోచించారు. కానీ, ఇప్పటి దాకా ఆమె నుండి సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
సుమన్ తనకు చేతనైనంతలో దానధర్మాలూ చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సుమన్ 2004లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. సుమన్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ సాగాలని ఆశిద్దాం.