మన హీరోలంతా బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజతో పాటు తదితరులు బీటౌన్ లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇక సీనియర్ హీరో నాగార్జున కూడా చాలా గ్యాప్ తరువాత మరోసారి ‘బ్రహ్మాస్త్ర’తో హిందీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇదే సినిమాలో మరో టాలీవుడ్ యంగ్ హీరోకు ఆఫర్ రాగా, ఆయన కాదనుకున్నారట.
Read Also : Review : భామా కలాపం (ఆహా)
యంగ్ హీరో సుధీర్ బాబు టాలీవుడ్ లో తనదైన శైలిలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2016లో వచ్చిన ‘బాఘీ’ చిత్రంలో విలన్‌గా నటించి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఆ సినిమాలో తన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చినా, సుధీర్ మళ్లీ బాలీవుడ్ సినిమాలో కనిపించలేదు. అయితే తాజాగా సుధీర్ ఈ విషయంపై స్పందిస్తూ త్వరలో విడుదల కానున్న బిగ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నటించే అవకాశం వచ్చిందని, అయితే దానిని తాను తిరస్కరించానని వెల్లడించాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్ ‘బ్రహ్మాస్త్ర’ నిర్మాతలు తనకు ఈ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేశారన్నారు. కానీ అదే సమయంలో ‘సమ్మోహనం’ రూపంలో మరో ఆఫర్ రావడంతో దాన్ని తిరస్కరించాడు. కరణ్ జోహార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను వదిలేసి ‘సమ్మోహం’ వంటి ఆహ్లాదకరమైన చిత్రాన్ని చేశాడు సుధీర్. అయితే ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యిందన్న విషయం తెలిసిందే. గతంలో విలన్ రోల్ చేశానని, ‘సమ్మోహనం’ లాంటి బ్రీజీ రోల్ చేయలేదని భావించి ఆ సినిమాను ఎంచుకున్నాడట. ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.