సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. ఆపై డైలాగులు వైవిధ్యంగా వల్లిస్తూ, తనదైన మేనరిజమ్ తో కామెడీ రోల్స్ లో భలేగా ఆకట్టుకున్నారు.
సుధాకర్ 1959 మే 18న జన్మించారు. రాయలసీమకు చెందిన వారు. ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్. దాంతో పలు చోట్ల సుధాకర్ విద్యాభ్యాసం సాగింది. ఏలూరులో ఫస్ట్ ఇయర్ ఇంటర్, గుంటూరులో సెకండ్ ఇంటర్ చదివాక సుధాకర్ మనసు నటనపైకి మళ్ళింది. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో ఆయన తండ్రి కూడా గారాబం చేసేవారు. తనయుడు కోరినట్టుగానే నటనలో శిక్షణ తీసుకోవడానికి సుధాకర్ ను చెన్నై పంపించారు. అక్కడ దక్షిణ చలనచిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో సుధాకర్ చేరారు. అక్కడే చిరంజీవి, హరిప్రసాద్ ఆయనకు మిత్రులయ్యారు. వీరందరికీ సీనియర్ రాజేంద్రప్రసాద్. అందరితోనూ సుధాకర్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ నలుగురిలో అందరికంటే ముందుగా హీరో ఛాన్స్ కొట్టేసింది సుధాకరే. భారతీరాజా తెరకెక్కించిన ‘కిళిక్కు పోగుమ్ రైలు’ చిత్రంలో సుధాకర్ హీరో వేషం వేశారు. అందులో రాధిక నాయిక. 1978లో విడుదలైన ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత సుధాకర్, రాధిక జంటగా పలు చిత్రాలు రూపొంది తమిళనాట విజయవిహారం చేశాయి. అప్పట్లో సుధాకర్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. అడపా దడపా మాతృభాష తెలుగులో సుధాకర్ నటించేవారు.
తమిళనాట హీరోగా సక్సెస్ రూటులో సాగుతున్న సుధాకర్ తెలుగుపై అంత దృష్టి సారించలేదు. అక్కడ వరుస విజయాలను చూసిన సుధాకర్ కు తమిళనాట ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఓ రాజకీయ పార్టీ సుధాకర్ ను తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయమని కోరింది. అయితే, సుధాకర్ కు రాజకీయాల కంటే నటనలోనే రాణించాలనే అభిలాష ఉండేది. అందువల్ల ఆ పార్టీ వారి కోరికను సుధాకర్ అంగీకరించలేదు. దాంతో తమిళనాట సుధాకర్ కెరీర్ పై దుష్ప్రభావం చూపింది. తమిళ చిత్రాలలో అవకాశాలు సన్నగిల్లే సమయంలోనే సుధాకర్ తెలుగు సినిమాల్లో నటించడానికి అంగీకరించడం మొదలెట్టారు. తమిళనాట హీరోగా సక్సెస్ రూటులో సాగిన సుధాకర్, మాతృభాషలో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. అందివచ్చిన అవకాశం వినియోగించుకుంటూ ముందుకు సాగారు. అలా ముందుగా రచ్చ గెలిచిన సుధాకర్ తరువాత తెలుగులో విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా అలరించారు.
తన మిత్రులు హరిప్రసాద్, నారాయణరావుతో కలసి చిరంజీవి హీరోగా ‘యముడికి మొగుడు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమా 1988వ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత రాజేంద్రప్రసాద్ హీరోగా ‘పరుగో పరుగు’ అనే చిత్రాన్ని కూడా సుధాకర్ నిర్మించారు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ పై సుధాకర్ నటనలోనే కొనసాగుతూ, ముఖ్యంగా హాస్యంలో తనకంటూ ఓ మేనరిజమ్ ఏర్పరచుకొని ముందుకు సాగారు. కొంతమంది నిర్మాతలు, దర్శకులు అదేపనిగా సుధాకర్ కు తమ చిత్రాలలో ముఖ్యపాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సమయంలో బిజీ కమెడియన్ గా సాగారు. తరువాత అవకాశాలు సన్నగిల్లాయి. అప్పుడు డిప్రెషన్ కు లోనయిన సుధాకర్ కోమాలోకి కూడా వెళ్ళి, కోలుకున్నారు. దాదాపు దశాబ్దం పాటు నటనకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఒకటి అర చిత్రాలలో నటించినా, మునుపటిలా ఆకట్టుకోలేక పోయారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ప్రశాంత జీవనం సాగిస్తున్నారు సుధాకర్