పరుచూరి బ్రదర్స్… కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ, సినిమాలకు రచన చేసేవారు అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఉయ్యూరు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ అన్నయ్యకు అప్పుడప్పుడూ రచనల్లో సాయం అందించేవాడు చిన్నవాడు గోపాలకృష్ణ. వీరిద్దరికీ ‘పరుచూరి బ్రదర్స్’గా నామకరణం చేసి ఆశీర్వదించిన ఘనత నందమూరి తారక రామారావుది. అప్పటి నుండి కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా రంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు. మూడు వందలకు పైగా చిత్రాలకు రచన చేశారు. పురాణేతిహాసాలను ఉదహరిస్తూ, సంభాషణలు రాయడంలో పరుచూరి బ్రదర్స్ ది ప్రత్యేక శైలి. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడమే కాదు… కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి, ఆ శాఖలోనూ తమదైన ముద్రను వేశారు. మరో విశేషం ఏమంటే… ఈ అన్నదమ్ములు వెండితెరపై పలు చిత్రాలలో నటించి, అలరించారు. వాచకంలో తనదైన బాణీని పలికించిన గోపాలకృష్ణ కంటే, సాత్వికమైన పాత్రలతో వెంకటేశ్వరరావు పోషించి, మెప్పించిన పాత్రలే అధికం.
Read Also : Maaran : ధనుష్ పై దారుణమైన ట్రోలింగ్ !!
ఇంతకూ విషయం ఏమంటే… పరుచూరి సోదరులలో పెద్దవారైన వెంకటేశ్వరరావుకు ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్యు సమస్యలతో బాధ పడుతున్నారు. బయటకు రావడం లేదు. వయోభారంతో కాస్తంత కృంగిపోయారు కూడా. ఇటీవల ప్రముఖ దర్శకుడు జయంత్ సి. పరాంజీ పరుచూరి వెంకటేశ్వరరావును కలిశారు. అప్పటి ఫోటో ఒక దానిని ఆయన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పోస్ట్ చేశారు. ‘గురువు గారు వెంకటేశ్వరరావును చూసి బాధపడ్డాను కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటిలానే చురుకుగా ఉంది’ అని పేర్కొన్నారు. కానీ డైరెక్టర్ జయంత్ పెట్టిన పరుచూరి వెంకటేశ్వరరావు ఫోటో చూసి చాలామంది అభిమానులు షాక్ కు గురయ్యారు. ‘గురువుగారూ మీరు ఇలా అయిపోయారేమిటీ?’ అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కాలంతో పాటు పెరిగే వయసు, దానితో పాటు మనిషిలో వచ్చే మార్పులను స్వీకరించకతప్పదు కదా!