SS Rajamouli Confirms RRR Sequel: ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయినప్పటి నుంచే సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సినిమా బాగా నచ్చడంతో పాటు అందులోని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలు బాగా ప్రభావితం చేయడంతో.. సీక్వెల్ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో సీక్వెల్ ఉండొచ్చని రెండు, మూడుసార్లు జక్కన్న సంకేతాలు ఇచ్చాడు. కానీ, సీక్వెల్ నిజంగానే ఉంటుందని ఎప్పుడూ కన్ఫమ్ చేయలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని కన్ఫమ్ చేయడంతో పాటు తాను, తన తండ్రి కొన్ని ఐడియాలపై చర్చించుకుంటున్నామని జక్కన్న వెల్లడించాడు.
నిన్న రాత్రి అమెరికాలోని చికాగోలో అభిమానులతో ముచ్చటించిన జక్కన్న.. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై పెదవి విప్పాడు. ‘‘ఇప్పటివరకూ నా సినిమాలు కథలు అందించిన నా తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై ఇదివరకే చర్చించాను. ప్రస్తుతం ఆయన ఆ సీక్వెల్‌పై పని చేస్తున్నారు’’ అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఈ మాట చెప్పడమే ఆలస్యం.. ఆ ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. అక్కడికి విచ్చేసిన అభిమానులందరూ చప్పట్లు, కేకలు వేస్తూ.. వాతావరణాన్ని సందడిగా మార్చేశారు. దీన్ని బట్టి.. మన ఇండియన్స్‌తో పాటు విదేశీయులు కూడా సీక్వెల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ సినిమా తన థియేట్రికల్ రన్‌లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించడంతో పాటు ఓటీటీలోనూ వ్యూవర్షిప్ పరంగా చరిత్ర సృష్టించింది. ఓటీటీలో రిలీజయ్యాకే విదేశీయులందరూ ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ఏ రేంజ్‌లో అంటే.. దీనిని ఆస్కార్స్‌కు ఎంపిక చేయకపోయినా, ఇతర విభాగాల్లో ఈ చిత్రాన్ని కన్సిడర్ చేయాలని ఆస్కార్స్ అకాడమీని సూచిస్తున్నారు. చిత్రబృందం కూడా ఆస్కార్స్‌లో ఎంట్రీ పొందేందుకు.. ఒక ప్రత్యేక క్యాంపెయిన్‌ని కూడా షురూ చేసింది. దానిక్కూడా విదేశీయులు పూర్తి మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.