నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ సత్య’ను నిలిపారు. ఈ పౌరాణిక చిత్రరాజం యన్టీఆర్ గురువు కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. యన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం 1971 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కావడం విశేషం!
గురుశిష్యుల బంధం!
యన్టీఆర్ ను ‘పాతాళభైరవి’తో సూపర్ స్టార్ గా నిలిపిన ఘనత కేవీ రెడ్డిదే. పౌరాణిక, జానపద చిత్రాలో రామారావుకు తిరుగులేదని నిరూపించిందీ ఆయనే! అయితే యన్టీఆర్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ముందుకు సాగారు. ఆ నేపథ్యంలో ‘సీతారామకళ్యాణం’ కథను రూపొందించి, అందులో రావణబ్రహ్మగా నటించాలని తపించారు. ఆ చిత్రానికి తన గురువు కేవీ రెడ్డినే దర్శకత్వం వహించమని కోరారు. రామారావును జనం శ్రీరామునిగానే చూస్తారని, రావణునిగా ఆయన బాగోరని కేవీ రెడ్డి తీర్మానించి, ఆ సినిమాకు దర్శకత్వం వహించనన్నారు. దాంతో యన్టీఆరే మెగాఫోన్ పట్టవలసి వచ్చింది. ‘సీతారామకళ్యాణం’తోనే రామారావు దర్శకునిగా మారారు. రావణబ్రహ్మగా నటించి మెప్పించారు. కానీ, తన గురువు కేవీ రెడ్డి దర్శకత్వంలో శ్రీరామ, రావణ పాత్రల్లో నటించాలన్నది రామారావు అభిలాష. అది ‘శ్రీకృష్ణ సత్య’తో తీరింది.
ఇక ఈ కథతో పాటే, ‘శ్రీరామపట్టాభిషేకం’ చిత్రకథనూ సముద్రాల సీనియర్ తో రాయించారు యన్టీఆర్. అందులోనూ శ్రీరామ, రావణ పాత్రల్లో తానే నటించాలని నిర్ణయించారు. ఆ కథలు ఎప్పుడు తెరకెక్కించాలని భావించారో కానీ, 1971లో కేవీ రెడ్డి తన తనయుణ్ణి విద్య కోసం విదేశాలు పంపించే ప్రయత్నం చేయసాగారు. ఆ సమయంలో కేవీరెడ్డికి కొంత ఆర్థిక సాయం అవసరమయింది. ఈ విషయాన్ని యన్టీఆర్ కు చేరవేశారు. గురువుపై అభిమానంతో ఆ పైకం సర్దారు రామారావు. అయితే కేవీ రెడ్డి, ఆ సొమ్ము ఊరకే పుచ్చుకోనని, ఏదైనా సినిమా తీసి పెడతానని రామారావుకు చెప్పారు. అలాగే కానిమ్మన్నారు యన్టీఆర్. తన వద్ద నున్న ‘శ్రీరామపట్టాభిషేకం, శ్రీకృష్ణ సత్య’ స్క్రిప్టులు చూపించారు. ఆ రెండింటిలో కేవీ రెడ్డి ‘శ్రీకృష్ణ సత్య’ను ఎంచుకున్నారు. ఇందులోనూ శ్రీరామ, రావణ పాత్రల్లో నటించారు రామారావు.
ఇందులో వేరే కథ…
‘శ్రీకృష్ణ సత్య’ కథ విషయానికి వస్తే- మన పురాణాల్లోనే సత్యభామ గురించి పలు కథలు ఉన్నాయి. ఆమె భూదేవి అవతారమని కొందరు చెబుతారు. లేదు అష్టలక్ష్మీదేవతలే కృష్ణుని అష్టమహిషులుగా వెలిశారని మరికొందరు అంటారు. అయితే ఈ సినిమా కథలో మాత్రం రామాయణకాలంలో చంద్రసేన అనే రాముని భక్తురాలే ద్వాపరంలో సత్యభామగా జన్మించినట్టు చూపించారు. ఇందులో కథ రామరావణ యుద్ధంతో మొదలవుతుంది. ఆ సమయంలో రావణుడు, తన సోదరసమానుడైన మహిరావణున్ని పిలుస్తాడు. అతను తన మాయ చేత రామలక్ష్మణులను బొమ్మలుగా చేసుకొని పట్టుకు పోతాడు. ఆ సమయంలో హనుమంతుడు, మహిరావణుని లోకం పోయి, తన స్వామివారలను విడిపించుకు వస్తాడు. ఆ సమయంలో శ్రీరాముని భక్తురాలయిన నాగకన్య చంద్రసేన తనను స్వామి వరించాలని ఆశిస్తుంది. ఆమెకు స్వామివారు మరు జన్మలో సత్యభామగా పుట్టి, నీ కోరిక తీర్చుకుంటావని వరమిస్తాడు. అలా సత్రాజిత్తు కూతురుగా జన్మించిన సత్యభామ, శ్రీకృష్ణుల వారి మూడోభార్యగా వస్తుంది. అష్ట భార్యలతో అలరారే శ్రీకృష్ణుడు తనకు మాత్రమే వశం కావాలని సత్య పరితపిస్తుంది. ఆమెకు అసలైన శ్రీకృష్ణతత్వం బోధపడాలని స్వామి భావిస్తారు. అందులో భాగంగానే శ్రీకృష్ణతులాభారం సాగుతుంది. చివరకు ధనగర్వితురాలయిన సత్యభామకు సర్వం బోధపడుతుంది. రుక్మిణి వచ్చి, స్వామి వారిని తులసీదళంతో తూచి ఆయనను నారదబంధ విముక్తుణ్ణి చేస్తుంది. తరువాత సత్యభామ శ్రీకృష్ణ గీతాలు పాడుతూ శేషజీవితం గడుపుతానంటుంది. శ్రీకృష్ణుడు పాండవదూతగా రాయబారం వెళ్ళి, కౌరవసభలో విశ్వరూపం చూపిస్తాడు. తరువాత పార్థునికి గీత బోధిస్తూ మరోమారు విశ్వరూపం చూపించడంతో కథ ముగుస్తుంది.
నటవర్గం…
ఈ చిత్రంలో యన్టీఆర్ శ్రీరామ, శ్రీకృష్ణ, రావణ పాత్రల్లో నటించారు. ఇక యస్వీ రంగారావు మహిరావణ, సుయోధన పాత్రల్లో కనిపించారు. ‘జయసింహ, రేచుక్క-పగటిచుక్క’ తరువాత యన్టీఆర్ సొంత చిత్రంలో యస్వీఆర్ నటించడం ఇందులోనే. రామారావు, రంగారావు కలసి నటించిన చివరి పౌరాణిక చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే వారిద్దరకీ గురువు అయిన కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం! ఈ సినిమాకు ముందు 1971లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘శ్రీకృష్ణవిజయము’ చిత్రంలో యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, యస్వీఆర్ కాలయవనునిగా నటించారు. అందులో వసుంధరగా నటించిన జయలలిత ఈ చిత్రంలో సత్యభామగా నటించడం విశేషం! దేవిక రుక్మిణిగా నటించిన ఈ చిత్రంలో కాంతారావు నారదునిగా నటించగా, మిగిలిన పాత్రల్లో పద్మనాభం, చిత్తూరు నాగయ్య, రాజనాల, ధూళిపాల, మిక్కిలినేని, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, ఆర్జా జనార్దనరావు, త్యాగరాజు, ఎస్.వరలక్ష్మి, ఋష్యేంద్రమణి, సంధ్యారాణి, వై.విజయ, చలపతిరావు నటించారు.
సంగీతసాహిత్యాలు
యన్టీఆర్ సొంత చిత్రాలకు టి.వి.రాజు ఎక్కువగా సంగీతం సమకూర్చేవారు. అయితే కేవీ రెడ్డికి పెండ్యాల నాగేశ్వరరావు అంటే అభిమానం. దాంతో ‘శ్రీకృష్ణ సత్య’కు పెండ్యాలను సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. తరువాత యన్టీఆర్ కూడా మరికొన్ని చిత్రాలకు పెండ్యాలతోనే స్వరకల్పన చేయించుకోవడం విశేషం. ఈ సినిమాలో పలు పాత శ్లోకాలను, పద్యాలను ఉపయోగించుకున్నారు. స్థానం వారి ‘శ్రీకృష్ణతులాభారం’లోని పదాలు సైతం ఇందులో చోటు చేసుకున్నాయి. పింగళి రచన చేసి, కొన్ని పాటలు పలికించారు. సినారె, సముద్రాల జూనియర్ మరికొన్ని పాటలు రాశారు. అంతకు ముందు యన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన ‘శ్రీకృష్ణావతారం’లో తిరుపతి వేంకటకవులు రచించిన రాయబారం పద్యాలు ఉపయోగించుకున్నారు. అందులో ఘంటసాల గానం చేసిన ఆ పద్యాలను ఇందులో బాలు చేత పాడించడం విశేషం. అవే పద్యాలను యన్టీఆర్ తరువాత రూపొందించిన ‘దానవీరశూరకర్ణ’లో రామకృష్ణతో గానం చేయించడం మరింత విశేషం. ఇందులోని “అలుక మానవే చిలుకల కొలికిరో…”, “ప్రియా ప్రియా మధురం…” పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఏసుదాస్ తో పాడించిన “శ్రీరామ జయరామ జయ జయ రామా…రఘురామా…” పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది.
ఆర్.కె.బ్రదర్స్ బ్యానర్…
అంతకు ముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ (యన్.ఏ.టి.) పతాకంపై అనేక చిత్రాలను నిర్మించారు యన్టీఆర్. తరువాత ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ను రామకృష్ణ, యన్.ఏ.టి. పతాకంపై తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ‘ఆర్.కె.బ్రదర్స్’ పతాకంపై రూపొందించారు. ‘పాతాళభైరవి’ చిత్రానికి మొదలు అనేక విజయావారి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మార్కస్ బార్ట్లే ఈ మూవీకి కూడా ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. 1971 డిసెంబర్ 24న విడుదలైనప్పుడు ‘శ్రీకృష్ణ సత్య’ 24 రీళ్ళ నిడివితో, అప్పటికి తెలుగులో అతి పెద్ద సినిమాగా రూపొందింది. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. పాతికకు పైగా కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఏడు కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఆ యేడాది యన్టీఆర్ సూపర్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలచింది.
ఈ సినిమా అతి నిడివి కారణంగానే మరింత విజయం సాధించలేక పోయిందని అభిమానులు భావించారు. అయితే తన గురువు కేవీ రెడ్డి తీసిన చిత్రాన్ని యన్టీఆర్ కుదించడానికి ఇష్టపడలేదు. దాంతో ఈ సినిమాను రిపీట్ రన్ గా విడుదల చేయడానికి ఆయన అంగీకరించలేదు. దాదాపు 16 సంవత్సరాల తరువాత ఈ సినిమాను 18 రీళ్ళకు కుదించి, 1987లో విడుదల చేశారు. అప్పుడు కూడా ‘శ్రీకృష్ణ సత్య’ జయకేతనం ఎగురవేయడం విశేషం.