హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో మరింత జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘చుక్కల మేళం .. దిక్కుల తాళం.. ఒక్కటయే ఈ సంబరం.. ఆ సాంతం నీ సొంతం’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాటకు మణిశర్మ బాణీలు అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కల్యాణ్ చక్రవర్తి పాట రాశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది.