Sri Simha Bhaag Saale Movie First Look Released: కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ మూవీ ఇటీవలే విడుదలైంది. మరో రెండు మూడు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ఒకటైన ‘భాగ్ సాలే’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రణీత్ సాయి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ మూవీని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, “ఈతరం ప్రేక్షకులను అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న మా చిత్రం ‘భాగ్ సాలే’. హీరో శ్రీసింహా అర్జున్ పాత్రను పోషిస్తుండగా, నేహా సొలంకి హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ విజయ్, నందిని రాయ్ ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్ కు గురి చేస్తుంది. రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు” అని తెలిపారు.
కీరవాణి మరో తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తుండగా, కార్తీక ఆర్ శ్రీనివాస్ కూర్పరిగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి రమేశ్ కుషేందర్ సినిమాటోగ్రాఫర్.