Sri Ramulayya: పాతికేళ్ళ క్రితం ఇదే రోజు, అంటే 1997 నవంబర్ 19న తెలుగునేల ఉలిక్కిపడేలా ఓ దుర్ఘటన జరిగింది. అది అటు రాజకీయరంగంలోనూ, ముఠాకక్షల్లోనూ, చిత్రసీమలోనూ ప్రకంపనలు రేపింది. అదే అప్పట్లో జనాన్ని వణికేలా చేసిన ‘కారు బాంబు’ దాడి! జూబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియోస్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎంతోమంది ప్రాణాలను బలికొంది.
ఈ తరం వారికి ఈ కారుబాంబు కేసు గురించి తెలియదేమో కానీ, మొన్నటి దాకా రామానాయుడు స్టూడియోస్ రోడ్ లో పయనించే వారెంతోమంది ఆ సంఘటనను గుర్తు చేసుకొనేవారు. ప్రత్యక్షసాక్షులు అయితే ఇప్పటికీ వణకి పోతారు. ఆ దుర్ఘటనకు కారకులు ‘సూరి’ అనే పేరు మోసిన గంగుల సూర్యనారాయణరెడ్డి. తన ప్రత్యర్థి అయిన అప్పటి పెనుగొండ నియోజక వర్గం శాసనసభ్యుడు పరిటాల రవీంద్రను మట్టుపెట్టాలని సూరి ‘కారు బాంబ్’ ప్లాన్ వేశాడు. అదే రోజున పరిటాల రవి, దర్శకుడు ఎన్.శంకర్ నిర్దేశకత్వంలో మోహన్ బాబు హీరోగా ‘శ్రీరాములయ్య’ చిత్రాన్ని రామానాయుడు స్టూడియోస్ లో ఆరంభించారు. తన తండ్రి పరిటాల శ్రీరాములయ్య జీవితగాథ ఆధారంగా ఆ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నారు రవి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పెనుగొండ, అనంతపూర్ నుండి వేలాది మంది పరిటాల రవి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ కు వారంతా సొంత వాహనాల్లోనూ, మరికొందరు ప్రత్యేకంగా బస్సులు వేసుకొని, ఇంకొందరు ఆర్టీసీ బస్సులనే రెంట్ కు తీసుకొని విచ్చేశారు. ఆ వాహనాలతో ఆ రోజు ఫిలిమ్ నగర్ ఎక్కడ చూసినా నిండిపోయిందనే చెప్పాలి. అంతటి రద్దీగా ఉన్నసమయంలో కార్ బాంబును పేల్చారు. దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోగా, కొందరు క్షతగాత్రులయ్యారు.
ఈ టీవీ బృందం బలి!
ఉదయాన్నే ‘శ్రీరాములయ్య’ ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఆ షూటింగ్ కు దాసరి నారాయణరావు, రామానాయుడుతో పాటు మరికొందరు రాజకీయ, సినీప్రముఖులు సైతం హాజరయ్యారు. మోహన్ బాబుపై తొలి షాట్ చిత్రీకరించారు. తరువాత ప్రెస్ మీట్ జరిగింది. పరిటాల రవి, తన అనుచరులతో కలసి బయలు దేరారు. ఆ జనాన్ని షూట్ చేస్తూ ఈటీవీ బృందం మరో వెహికల్ లో వెళ్తూఉండగా, పరిటాల కారును పేల్చాలని టార్గెట్ చేశారు. సరిగా అదే సమయానికి పరిటాల వెహికల్ ను క్రాస్ చేసి ఈటీవీ బృందం ఉన్న వాహనం ముందుకు పోయింది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కంపించేలా కారు బాంబు పేలింది. పరిటాల రవికి కొన్ని గాయాలయ్యాయి. ఈటీవీ వాహనంలోని వారందరూ మరణించారు. వారితో పాటు మరికొందరు ఆ కారుబాంబుకు బలయ్యారు. అప్పట్లో ఈటీవీ సినిమా ఇన్ చార్జ్ గా సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీశ్ బాబు పనిచేసేవారు. ఆయనతో పాటు ఉన్న కెమెరా మెన్, వారి అసిస్టెంట్స్ కూడా కారుబాంబు దాడిలో అసువులు బాసారు.
ఆ దుర్ఘటన తెలుగు చిత్రసీమతో పాటు యావత్ రాష్ట్రాన్నీ వణికించింది. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సినీతారలు ఆర్థిక సాయంగా కొంత మొత్తాలు అందజేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే కోర్టులో సూరి లొంగిపోయాడు. తరువాత కేసు నడిచింది. ఆయనకు శిక్ష పడింది. అతను జైలులో ఉండగానే, పరిటాల రవి హత్యకు స్కెచ్ వేయడం, మొద్దు శీను అనే వ్యక్తి రవిని హత్య చేయడం జరిగాయి. ఆ పై మొద్దు శ్రీను కూడా ఓ హోటల్ లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. తరువాత సూరిని కూడా అనుచరుడే చంపేశాడు. ఏది ఏమైనా 1997 నవంబర్ 19న జరిగిన ‘కారు బాంబు’ దాడి గుర్తుకు వస్తే, ఆ రోజున ప్రత్యక్షంగా చూసిన వారు ఈ నాటికీ చలించిపోతారు. ఏ సంబంధమూ లేని అమాయకుల ప్రాణాలు పోవడం అన్నది బాధాకరం. ఈ విషయం గుర్తుకు వచ్చినపుడల్లా సినిమా జర్నలిస్టులు ఆవేదనకు గురవుతూనే ఉంటారు.
ఈ సంఘటన జరిగిన తరువాత కొంతకాలానికి మళ్ళీ ‘శ్రీరాములయ్య’ షూటింగ్ మొదలయింది. అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఆ చిత్రంతోనే నందమూరి హరికృష్ణ నటునిగా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అందులోని వందేమాతరం శ్రీనివాస్ బాణీల్లో రూపొందిన “నను గన్న నాతల్లి రాయలసీమ…”, “భూమికి పచ్చాని రంగేసినట్టు…”, “పోరాటాల రాములు…”, “జోహారు జోహారు…”, “నీకిస్త తమ్ముడా… నీకిస్త…” అంటూ సాగిన పాటలు జనాన్ని భలేగా అలరించాయి. సౌందర్య నాయికగా రూపొందిన ఈ చిత్రం 1999 సెప్టెంబర్ 28న విడుదలై జనాదరణ పొందింది.