మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ కు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. అందులో స్పైడర్ మ్యాన్ కైతే స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర సూపర్ హీరోల సంగతి ఎలా ఉన్నా… అన్ని వర్గాలను ఆకట్టుకోవడంలో స్పైడర్ మ్యాన్ సీరిస్ ఓ అడుగు ముందుంటుంది. ఆ మధ్య వచ్చిన ‘స్పైడర్ మ్యాన్ : హోమ్ కమింగ్’, ‘స్పైడర్ మ్యాన్ – పార్ ఫ్రమ్ హోమ్’కు సీక్వెల్ గా గురువారం జనం ముందుకు వచ్చింది ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’.
పీటర్ పార్కరే (టామ్ హాలండ్) స్పైడర్ మ్యాన్ అనే విషయం బహిర్గతం కావడంతో తాజా చిత్రం మొదలవుతుంది. అతన్నో విలన్ గా ప్రపంచం ముందు నిలబెట్టడానికి వార్తా సంస్థలన్నీ ప్రయత్నం చేస్తాయి. దాంతో కోర్టు విచారణలు వంటి సమస్యలను ఎదుర్కొనడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ పీటర్ పార్కర్ కు ఇబ్బందులు మొదలవుతాయి. ఎం.ఐ.టీలో అతనికే కాకుండా అతని గర్ల్ ఫ్రెండ్ ఎం.జె. (జేండియా), స్నేహితుడికి కూడా సీటు రాదు. తనకు సంబంధించిన గతాన్ని జనం మర్చిపోతే, ఏ సమస్యా ఉండదని భావించిన పీటర్ పార్కర్ సాయం కోసం డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్ (బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్) ను ఆశ్రయిస్తాడు. అయితే ఆ ప్రక్రియలో జరిగిన చిన్నపాటి అవరోధంతో మల్టీవర్స్ ఓపెన్ అయిపోతాయి. స్పైడర్ మ్యాన్ కు సంబంధించిన గతాన్ని జనం మర్చిపోవడం మాట అటుంచి, ఇతర ప్రపంచ ద్వారాలు తెరచుకోవడంతో గతంలో స్పైడర్ మ్యాన్ తో పోరాడిన ప్రతినాయకులు ఇప్పుడు ప్రత్యక్షమౌతారు. అలా తన ముందుకు వచ్చిన ఐదుగురు సూపర్ విలన్స్ ను ప్రాణాలను తిరిగి వారి యూనివర్స్ కు పంపడానికి పీటర్ పార్కర్ ప్రయత్నిస్తాడు. మధ్యలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. ఇదే సమయంలో పార్కర్ స్నేహితుడి కారణంగా గతంలోని స్పైడర్ మెన్ తిరిగి ప్రత్యక్షమౌతారు. ఈ ముగ్గురు ఒక అవగాహనతో టాస్క్ ను ఎలా కంప్లీట్ చేశారన్నదే సినిమా!
ఒకరు కాదు అంతకు మించి అన్నట్టుగా ఇందులో ఏకంగా ముగ్గురు స్పైడర్ మెన్ కనిపించడం ఆ సూపర్ హీరో అభిమానులకు పెద్ద పండగనే చెప్పాలి. గత కొన్ని నెలలుగా ఇలాంటి విజువల్ వండర్ మూవీని థియేటర్లలో చూడలేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దీనికోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ వచ్చారు. వారు కోరుకున్న రోజు రావడంతో థియేటర్లలో పండగ వాతావారణం నెలకొంది. పైగా ఇందులో చూపించిన సూపర్ విలన్స్ అంతా గతంలో ప్రేక్షకులకు సుపరిచితులు కావడంతో వారి ఎంట్రీని బాగా ఎంజాయ్ చేశారు. లిజడ్, ఎలక్ట్రిక్ మ్యాన్, శాండ్ మ్యాన్, మ్యాక్స్ తదితరులతో ముగ్గురు స్పైడర్ మెన్ చేసిన పోరాటం థ్రిల్లింగ్ గా అనిపించింది. ఈ మూవీ క్లయిమాక్స్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మీద జరిగినట్టు చూపడం మరో విశేషం. విజువల్స్ ఎఫెక్ట్స్ ఇంకో లెవల్ లో ఉన్నాయి.
ఇక స్పైడర్ మెన్ ముగ్గురూ ఒకే సీన్ లో కనిపించే సన్నివేశాలు, వారందరి పేరు ఒకటే కావడం వంటి అంశాలను కాస్తంత కామెడీగా చూపించారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది. అయితే ద్వితీయార్థంలో మాత్రం కొద్ది సేపు కాస్తంత గ్రాఫ్ డౌన్ అయ్యింది. గతంలో స్పైడర్ మ్యాన్ సినిమాల్లో కొన్ని అయినా బోరింగ్ సీన్స్ ఉండేవి. అతనెవరో తెలుసుకోవాలని జనం తాపత్రయ పడటం, తన వాళ్ళ దగ్గర కూడా స్పైడర్ మ్యాన్ తన ఉనికి గోప్యంగా ఉంచడం, విలన్స్ తో చేసే యుద్థం ఇవన్నీ రొటీన్ గా ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా స్పైడర్ మ్యాన్ పాత్రధారులను, ప్రతినాయకులను ఒకే చోట చేర్చడం అనేది ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక స్పైడర్ మ్యాన్ ఆంటీ మే పార్కర్ (మారిసా టోమీ) మరణంతో కొద్దిగా సెంటిమెంట్ నూ మిక్స్ చేసినట్టు అయ్యింది.
మెయిన్ స్పైడర్ మ్యాన్ గా టామ్ హాలెంట్ చక్కగా నటించాడు. ఇక గతంలో ఇదే పాత్రలను పోషించి, జనాలను మెప్పించిన ఆండ్రూ గార్ఫీల్డ్, టోంబే మాగైర్ లను చూస్తే కొద్దిగా వయసు మీద పడినట్టు అనిపిస్తుంది. వాళ్ళకున్న ఇమేజ్ ను ఉపయోగించుకోవడానికి గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చి సరిపెట్టకుండా, ద్వితీయార్థంలో కీలక ఘట్టంలో తీసుకొచ్చి, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు జాన్ వాట్స్. స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ గా జేండియాతో పాటు ఇతర ప్రధాన పాత్రలను విలియమ్ డాఫ్, జెమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మోలీనా, కంబర్ బాచ్ తదితరులు పోషించారు. స్పైడర్ మ్యాన్ అభిమానులే కాకుండా సూపర్ హీరో మూవీస్ ను ఇష్టపడే వారికీ ఈ సినిమా నచ్చుతుంది. పైగా 2డీతో పాటు త్రీడీలోనూ చూసే అవకాశం ఉంది. ఒక రకంగా స్పైడర్ మ్యాన్ అభిమానులకు క్రిస్మస్ పది రోజుల ముందే వచ్చిందని అనుకోవాలి.
ప్లస్ పాయింట్స్
ఒకే తెరపై ముగ్గురు స్పైడర్ మెన్
ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్
ఐదుగురు సూపర్ విలన్స్ ఉండటం
మైనెస్ పాయింట్
బలహీనమైన కథ
రేటింగ్ : 3.25 / 5
ట్యాగ్ లైన్: అంతకు మించి!