(ఆగస్టు 27న కె.ఎస్. ప్రకాశ రావు జయంతి)
కోవెలమూడి సూర్యప్రకాశరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, స్టూడియో అధినేతగా, కథకునిగా పలు విన్యాసాలు చేసి అలరించిన ఘనుడు కె.ఎస్.ప్రకాశరావు. ఆయన తనయుడే దర్శకేంద్రునిగా జనం మదిలో నిలచిన కె.రాఘవేంద్రరావు. ఆయన వారసులందరూ చిత్రసీమలోనే రాణించారు. పెద్దకొడుకు కె.కృష్ణమోహనరావు నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. చిన్న కొడుకు కె.ఎస్.ప్రకాశ్ పేరు మోసిన సినిమాటోగ్రాఫర్, కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా చేశారు. ప్రకాశరావు అన్న కొడుకు కె.బాపయ్య కూడా దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రాఘవేంద్రరావు తనయుడికి తండ్రి పేరే సూర్యప్రకాశ్ అని పెట్టుకున్నారు. ప్రకాశరావు మనవడు ప్రకాశ్ కూడా తాతలాగే కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించారు. కె.ఎస్. ప్రకాశరావు రూపొందించిన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం కనిపించేది. అదే ఆయనను ప్రత్యేకంగా నిలిపిందని చెప్పవచ్చు.
పలు విన్యాసాలు…
కృష్ణాజిల్లా కోలవెన్నులో కోవెలమూడి సూర్యప్రకాశరావు 1914 ఆగస్టు 27న కన్ను తెరిచారు. సంపన్నుల ఇంట పుట్టడంతో బాల్యం నుంచీ ఆయనకు ఆడింది ఆటగా సాగింది. ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ చదివిన వారికి కూడా అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడటం వచ్చేది. సూర్యప్రకాశరావు హైస్కూల్ చదువు కాగానే ఉద్యోగం చేయాలన్న కోరిక కలిగింది. కొన్నాళ్ళు భీమా ఏజెంట్ గా పనిచేశారు. తరువాత ఓ బంగారు నగల దుకాణంలోనూ ఉద్యోగం చేశారు. మొదటి నుంచీ సూర్య ప్రకాశరావు మనసులో అభ్యుదయ భావాలు నాట్యం చేసేవి. అలా ఆయనను ప్రజానాట్యమండలి ఆకర్షించింది. అందులో చేరిన తరువాత నాటకాలవైపు మనసు మళ్ళింది. ఆ తరువాత సినిమాలవైపూ సాగారు. గూడవల్లి రామబ్రహ్మం, ప్రకాశరావులోని చురుకుదనాన్ని పసికట్టారు. 1941లో తాను రూపొందించిన ‘అపవాదు’ చిత్రంలో ప్రకాశరావును కథానాయకునిగా ఎంచుకున్నారు రామబ్రహ్మం. ఆ సినిమా ప్రకాశరావుకు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత తాను నిర్మించిన “పత్ని, ద్రోహి” చిత్రాల్లో నటించారు ప్రకాశరావు. అప్పటికే ‘గృహప్రవేశం’ చిత్రంలో హీరోగా నటించి, దర్శకత్వం నిర్వహించిన ఎల్.వి.ప్రసాద్, ప్రకాశరావుకు మంచి స్నేహితులయ్యారు. దాంతో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘ద్రోహి’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం నాయికలుగా నటించారు. ఈ సినిమా తరువాత కూడా ప్రకాశరావు నిర్మించిన చిత్రాలలో జి.వరలక్ష్మి కీలక పాత్రలు పోషించారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే వివాహితుడైన ప్రకాశరావు, వరలక్ష్మిని రెండో పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతుల తనయుడే ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.ఎస్.ప్రకాశ్.
ప్రకాశరావు తొలుత ‘స్వతంత్ర’ పతాకంపై చిత్రాలు నిర్మించారు. తరువాత ప్రకాశ్ ప్రొడక్షన్స్ నెలకొల్పారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ‘దీక్ష’ చిత్రం ద్వారా ఆచార్య ఆత్రేయను సినిమా రంగానికి పరిచయం చేశారు. అందులో ఆత్రేయ రాసిన “పోరా బాబూ…పో… పోయి చూడు లోకం పోకడ…” పాట అప్పట్లో జనాన్ని విశేషంగా అలరించింది. జి.వరలక్ష్మి, ఏయన్నార్, నంబీయార్ ముఖ్యపాత్రధారులుగా ‘కన్నతల్లి’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. “రేణుకాదేవీ మహాత్మం, గుళ్ళో పెళ్ళి, మోహినీ రుక్మాంగధ” వంటి చిత్రాల తరువాత యన్టీఆర్ హీరోగా రామానాయుడు నిర్మించిన ‘స్త్రీజన్మ’కు దర్శకత్వం వహించారు ప్రకాశరావు. ఆ తరువాత శివాజీగణేశన్, తన భార్య జి.వరలక్ష్మితో తమిళంలో ‘హరిశ్చంద్ర’ రూపొందించారు. ఏయన్నార్, జమునతో తెరకెక్కించిన ‘బందిపోటు దొంగలు’ అంతగా అలరించలేకపోయింది. తరువాత యన్టీఆర్ హీరోగా ప్రకాశరావు రూపొందించిన ‘విచిత్ర కుటుంబం’ విజయం సాధించింది.
కొన్ని విశేషాలు…
యన్టీఆర్ పుట్టినరోజు మే 28న విడుదలైన తొలి చిత్రంగా ‘విచిత్ర కుటుంబం’ నిలచింది. అప్పటి నుంచీ తెలుగునాట హీరోల పుట్టినరోజు కానుకలుగా వారు నటించిన సినిమాలు విడుదలయ్యే సంప్రదాయం నెలకొంది. ఏయన్నార్ తో నవలాచిత్రంగా ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమనగర్’ చిత్రం సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను నిలిపింది. ఈ చిత్రం తమిళంలో ‘వసంత మాళిగై’గా శివాజీగణేశన్ తో రూపొందింది. శివాజీ గణేశన్ కెరీర్ లో ఎక్కువ కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చిత్రంగా ‘వసంతమాళిగై’ నిలచింది. ఇదే చిత్రాన్ని హిందీలో రాజేశ్ ఖన్నాతో ‘ప్రేమ్ నగర్’గా రూపొందించారు ప్రకాశరావు. ఈ మూడు చిత్రాలను సురేశ్ సంస్థనే నిర్మించింది. అలా ఆ సంస్థకు అచ్చివచ్చిన దర్శకునిగా నిలిచారు ప్రకాశరావు. ఇక సత్యచిత్ర నిర్మాణ సంస్థ తొలి చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా ప్రకాశరావు దర్శకత్వంలోనే రూపొందింది. ఈ సినిమాతోనే శోభన్ బాబుకు స్టార్ డమ్ లభించడం విశేషం. కృష్ణతో ప్రకాశరావు రూపొందించిన ‘చీకటివెలుగులు’ ఆ రోజుల్లో మ్యూజికల్ హిట్ గా నిలచింది. శోభన్ బాబుతో ప్రకాశరావు రూపొందించిన “నా తమ్ముడు, పెద్దకొడుకు, జీవితం, ఇదాలోకం, కోడెనాగు” చిత్రాలు కూడా అలరించాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం ఏయన్నార్ ‘సెక్రటరీ’ కూడా ప్రకాశరావు దర్శకత్వంలోనే తెరకెక్కింది.
కొన్ని తమిళ, కన్నడ చిత్రాలు సైతం ప్రకాశరావు దర్శకత్వంలో వెలుగు చూశాయి. ఏయన్నార్, శ్రీదేవి జంటగా రూపొందిన ‘ముద్దుల మొగుడు’ ప్రకాశరావు చివరి చిత్రం అని చెప్పవచ్చు. ప్రకాశరావు చిత్రాలలో స్క్రీన్ ప్లే బాగుంటుందని అప్పటి దర్శకులు కొనియాడేవారు. తనయుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అనేక చిత్రాల రూపకల్పనలో ప్రకాశరావు సూచనలు, సలహాలు ఉండేవనీ చెబుతారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన తనయులు బాపయ్య, రాఘవేంద్రరావులే కాదు, ఎంతోమంది చిత్రసీమలో రాణించారు. చిత్రసీమకు ప్రకాశరావు చేసిన సేవలకు గుర్తింపుగా 1995లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 1996లో కె.ఎస్.ప్రకాశరావు తుదిశ్వాస విడిచారు.